గంటా రాజీనామాపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 6, 2021, 5:46 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని ప్రకటించిందన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని ప్రకటించిందన్నారు. 

అయితే దీనికి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదని ఈలోపే హంగామా చేసేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమాలు, పోరాటాలు అంటూ గందరగోళం చేస్తున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు.

ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా ఉండేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. ఖచ్చితంగా తాము బాధ్యత తీసుకునే ప్రవర్తిస్తామని అంబటి స్పష్టం చేశారు. కేంద్రం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు తప్పకుండా  మాట్లాడతామని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఈ విషయంలో ముందే పోటీ పడుతున్నారని.. ట్వీట్లు పెట్టే చంద్రబాబు నాయుడి కన్నా, రాజీనామా చేసిన గంటా కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తమ పార్టీకి గౌరవం వుందన్నారు.

అన్ని వున్న ఆకు అణిగి మణిగి వుంటుందని.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంటూ అంబటి సెటైర్లు వేశారు. కొడుకు పేరు సోమ లింగమన్నట్లు ఓవరాక్షన్ చేస్తున్నారని రాంబాబు మండిపడ్డారు.

Also Read:టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామా: స్పీకర్ కు లేఖ

అసలు రాజీనామా అంటే స్పీకర్ ఆమోదముద్ర వేస్తేనే నమ్ముతారని.. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఆ సమస్య పరిష్కారమన్నా కావాలి, ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసే వ్యక్తి మరణిస్తేనే జనం నమ్ముతారని అంబటి స్పష్టం చేశారు.

బూటకపు రాజీనామాలు, బూటకపు ఆమరణ నిరాహార దీక్షలు ఎన్నో చూశామన్నారు. తాము కూడా రాజీనామాలు చేశామని.. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచినట్లు ఆయన గుర్తుచేశారు.

ఫార్మాట్‌లో రాజీనామాలు చేయాలని.. ఇలాంటి నాటకాల్ని ప్రజలు నమ్మొద్దని అంబటి విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో స్పందిస్తామని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారని రాంబాబు స్పష్టం చేశారు.

ఈ విషయం మీద బీజేపీ నేతలు కూడా పోరాటం చేస్తామని చెబుతున్నారని.. ఢిల్లీ వెళ్లి మాట్లాడి రావొచ్చు కదా అని అంబడి ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ 2018లో ప్రారంభమైందని అప్పుడు చంద్రబాబు సీఎంగా వున్నారని మండిపడ్డారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించామని.. రాంబాబు గుర్తు చేశారు. 

విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ 2018లోనే ప్రారంభమైందని, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు. అప్పుడు వాజ్ పేయి మెడలు వంచామని చంద్రబాబు అంటున్నారని, వాజ్ పేయి లేరు కాబట్టి ఏమైనా అనొచ్చని ఆయన అన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజీనామాలు అవసరం లేదని, కేంద్రంతో మాట్లాడుతున్నామని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. చాలా సార్లు తాను రాజీనామా చేస్తానని గంటా శ్రీనివాస రావు అన్నారని ఆయన గుర్తు చేశారు. గంటా భావోద్వేగంలో రాజీనామా చేశారని అభిప్రాయపడ్డారు. గంటా రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో ఉందో, లేదో అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం అందరినీ ఆందోళనలో పడేసిందని అన్నారు. గంటా ఈ మధ్య రాజకీయంగా సైలెంట్ అయ్యారని ఆయన అన్నారు.

click me!