అఖిలప్రియ అరెస్టయితే.. ట్వీట్లు, ఘీంకారాలు, కూతలేవి: బాబుపై అంబటి ఫైర్

By Siva KodatiFirst Published Jan 7, 2021, 5:23 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్‌ పరామర్శించారని.. మరి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అఖిలప్రియను పరామర్శించరా అంటూ రాంబాబు ఎద్దేవా చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్‌ పరామర్శించారని.. మరి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అఖిలప్రియను పరామర్శించరా అంటూ రాంబాబు ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు కేసును రాజకీయ ప్రతీకార కేసుగా వక్రీకరించి ప్రచారం చేశారని రాంబాబు మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువులుగా పేర్కొంటున్నవారిని కిడ్నాప్ ‌చేసి అరెస్టయిన అఖిల ప్రియను పరామర్శించరా అంటూ అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయిన అఖిలప్రియ కిడ్నాప్‌ కేసులో ఏ–1 ముద్దాయిగా అరెస్టయితే చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరుమెదపడంలేదని ఆయన దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడికి ఒకలా, అఖిలప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. అఖిలప్రియ అరెస్టుపై తేలుకుట్టిన దొంగల్లా తండ్రీ, కొడుకులిద్దరూ ఎందుకు వ్యవహరిస్తున్నారు అంబటి ఎద్దేవా చేశారు. 

Also Read:జైల్లో డాక్టర్లుంటారు.. అఖిలప్రియకు హైకోర్టులో చుక్కెదురు

అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినా, దాన్ని రాజకీయ వేధింపులు కేసుగా చిత్రీకరించి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డారని ఆయన ధ్వజమెత్తారు.

దీనికోసం ఎన్ని డ్రామాలు చేయాలో, అన్ని డ్రామాలు చేశారని ఆయన సెటైర్లు వేశారు. అఖిలప్రియ అరెస్టు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో...? దీనిని ఎలా అర్థం చేసుకోవాలని రాంబాబు ప్రశ్నించారు.

అఖిలప్రియ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబు ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్‌ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అదే కిడ్నాప్‌ కేసు ఏపీలో జరిగి ఉంటే చంద్రబాబు, లోకేష్, వారి అనుకూల మీడియా ఎలా రచ్చ చేసేవారో మనం ఊహించుకోవచ్చంటూ చురకలంటించారు.

తండ్రిలేని పిల్లను వేధిస్తున్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని.. ఇలా నాటకాలు ఆడుతూ ప్రచారాన్ని రక్తికట్టించేవారని రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల నైజానికి, చంద్రబాబు డొంకతిరుగుడు వ్యవహారానికి.. అఖిలప్రియ అరెస్టు వ్యవహారం ఒక పక్కా ఉదాహరణ అంటూ అంబటి మండిపడ్డారు.

click me!