
ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఈ నెల 17న జరగనున్న త్రిసభ్య కమిటీ భేటీ ఎజెండాలో మార్పులు చోటు చేసుకోవడంపై వైసీపీ ఎమ్మెల్యే (ysrcp) అంబటి రాంబాబు (ambati rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకొచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే.. జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారని ఆయన దుయ్యబట్టారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) వివరణ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండాలో ప్రత్యేక హోదా వుండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని రాంబాబు నిలదీశారు. సుజనా చౌదరి (sujana chowdary) , సీఎం రమేశ్‌లు చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.
కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది.
ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం Central Home ministry త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ Virtual గా నిర్వహించనున్నారు.
ఈనెల 8న హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన భేటీలో Tripartite Committee ఏర్పాటు చేసిన హోం శాఖ. ఇరు రాష్ట్రాల మధ్య గత ఏడేళ్లుగా పరిష్కారం కాని అంశాలను... పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ లతో కమిటి ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.