చూస్తూ వుండండి... వైసిపి నుండి టిడిపిలోకి భారీ వలసలు: అచ్చెన్నాయుడు సంచలనం

By Arun Kumar PFirst Published Jul 1, 2022, 12:21 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపి నుండి ప్రతిపక్ష టిడిపిలో భారీగా వలసలు వుంటాయని... చివరికి ఆ పార్టీలో వైఎస్ జగన్, ఆయన జీతగాళ్లే మిగులుతారని టిడిపి నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.  
 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ సాగిస్తున్న పాలన వైసిపి నాయకులకే నచ్చడం లేదని... రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని వారుకూడా నమ్ముతున్నారని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అందుకోసమే ఇప్పటికే పలువురు వైసిపి నేతలు అధికారపార్టీని కాదని ప్రతిపక్ష టిడిపిలో చేరారని  తెలిపారు. భవిష్యత్ లో వైసీపీ నుంచి టీడీపీలో జోరుగా వలసలు వుంటాయని... అందుకు చాలామంది సిద్దంగా వున్నారని అచ్చెన్నాయుడు  అన్నారు. 

వైసిపి పాలన నచ్చక టిడిపిలో చేరుతున్న వారిని సీఎం జగన్, ఆ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని... పోలీసులను ఉపయోగించిన కేసుల పేరిట వేధిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఇలా టిడిపిలో చేరిన నాయకులపై వైసీపీ నేతలు కక్ష్యసాధింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. టిడిపిలో చేరిన నాయకుల ఇళ్లపై దాడిచేయడం, పోలీస్ కేసులు పెట్టించి వేధించడం వంటి చర్యలను మానుకోవాలని అచ్చెన్న సూచించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతజిల్లా అయిన ఉమ్మడి కడపకు చెందిన రాజంపేట పార్లమెంట్ వైసిపి రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్డి టిడిపిలో చేరినట్లు అచ్చెన్నాయుడు గుర్తుచేసారు. అప్పటినుండి వైసిపి ప్రభుత్వం కొండెడ్డిని టార్గెట్ చేసిందని... వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు ఆయనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఇప్పటికే చంద్రగిరి,మదనపల్లి పోలీస్ స్టేషన్లలో కొండ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించడమే కాదు... ఆయన ఇంటిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వైసిపి అరాచక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

read more  అయ్యన్న ఇంటిని కూల్చివేత... ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

వైసిపి పార్టీ విధానాలు, ప్రభుత్వ పాలన నచ్చక టిడిపిలో చేరిత కక్ష్య సాధింపు చర్యలకు దిగుతారా? అంటూ నిలదీసారు. ఏ నాయకుడికైనా, ప్రజలకైనా తమకు నచ్చిన పార్టీలో చేరే హక్కు ప్రజాస్వామ్యమే కల్పించిందన్నారు. అలాంటిది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా నాయకులు, ప్రజల హక్కుల్ని కాలరాస్తూ వైసిపి రాక్షస పాలన సాగిస్తోందని అచ్చెన్న ఆరోపించారు. 

జగన్ రెడ్డి అరాచక పాలనను వైసిపి నాయకులే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అలాగే జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కాబట్టి పోలీసులు కూడా వైసిపి నాయకులకు కొమ్ముకాస్తూ ప్రతిపక్ష టిడిపి నాయకులను ఇబ్బందిపెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

ఇదిలావుంటూ ఇటీవల సీఎం జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి 175 కు 175 స్థానాలు వైసిపి గెలుస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ఒకవేళ జగన్ చెప్పినట్లే 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళాలు వేస్తామ‌ంటూ అచ్చెన్న సవాల్ విసిరారు. దమ్ముంటే జ‌గ‌న్ ఇప్పుడే ఎన్నికల‌కు వెళ్లాల‌ని... మీ బలమెంతో, మా బలమెంతో వెంటనే తేలిపోతుందని అన్నారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌న్న నమ్మకమున్న జ‌గ‌న్‌ ఈ పని చేయాలని అచ్చెన్న సవాల్ విసిరారు. 

త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతో తేలిపోతుందన్నారు. అలా కాకుండా ఇలా మాటలతో మభ్యపెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం మానుకోవాలని అచ్చెన్న సూచించారు. 

  

click me!