జగన్‌ గెలవాల్సిందే , వైసీపీలో ఇంకా చాలా మార్పులు జరుగుతాయ్ .. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 12, 2023, 6:18 PM IST
Highlights

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది . రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు వుండబోతున్నాయని వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు .

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. ఆ వెంటనే రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో వైసీపీ బాధ్యులను ఆ పార్టీ మార్చి, కొత్తవారిని నియమించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వున్న వారిని , టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేనివారిని జగన్ క్షమించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో మరింత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా దీనిపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకోవాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నామని.. గాజువాకలోనూ సమన్వయకర్తని మార్పు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి సమాచారం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు వుండబోతున్నాయని.. లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని , దీని వల్ల టీడీపీలోకి ఎలాంటి వలసలు వుండబోవని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

Also Read: YCP Changed Incharges: వైసీపీ సంచలన నిర్ణయం.. 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జీల మార్పు..కొత్త అభ్యర్థులు వీళ్లే..

అయితే ఆళ్ల బాటలోనే మరికొందరు వైసిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్దమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వసంత క‌‌ృష్ణ ప్రసాద్ ది. మైలవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కృష్ణప్రసాద్ కూడా వైసిపిని వీడనున్నారని... ఇప్పటికే రాజీనామాకు కూడా సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.చివరకు ఈ ప్రచారం వైసిపి పెద్దలవరకు వరకు చేరింది. దీంతో తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై స్వయంగా వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

కొందరు కావాలనే తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని... తాను రాజీనామా చేసినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేసారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించేందుకే ఈ రాజీనామా ప్రచారం ప్రారంభించారని... దీన్ని తిప్పికొట్టాలని వైసిపి శ్రేణులకు వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.   

click me!