జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన నేతల మధ్య ఆధిపత్యపోరు సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి తోట నరసింహం, చంటి బాబులు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
కాకినాడ: జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రానున్న ఎన్నికల్లో పోటీ కోసం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ మంత్రి తోట నరసింహం వర్గాలు పోటా పోటీలుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి.
జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి జ్యోతుల చంటి బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి తోట నరసింహాం భావిస్తున్నారు. కొంత కాలంగా నరసింహం రాజకీయాల్లో స్థబ్దుగా ఉన్నారు. ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. ఈ పరిణామం ఎమ్మెల్యే చంటిబాబుకు ఇబ్బందిగా మారింది. చంటిబాబు వర్గీయులు , తోట నరసింహం వర్గాలు పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తనపై ఎమ్మెల్యే చంటి బాబు అవినీతి పరుడంటూ చేసిన విమర్శలపై మాజీ మంత్రి తోట నరసింహం మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.తాను రెండు దఫాలు జగ్గంపేట నుండి ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని తోట నరసింహం గుర్తు చేస్తున్నారు. తనపై అవితీని ఆరోపణలు చేస్తే ప్రజలే చంటిబాబుకు బుద్ది చెబుతారన్నారు.
2019లో జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్‌సీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు తోట నరసింహం టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. తోట నరసింహం సతీమణి పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ దఫా జగ్గంపేట నుండి పోటీ చేయాలని తోట నరసింహం భావిస్తున్నారు. తోట నరసింహం తనయుడు రాంజీ కూడ ఈ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తాను పోటీ చేయబోనని తన తండ్రే జగ్గంపేట నుండి పోటీ చేయనున్నారని తోట రాంజీ ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుండి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఎవరికి టికెట్ ఇవ్వనుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.