
హింసకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిందన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తన ఓటమిని అంగీకరించకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీల్లో నాలుగు స్థానాలు గెలవగానే కొంతమంది చొక్కాలు చించుకుంటున్నారని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మా ప్రభుత్వ పనితీరుకు ఫలితాలు అద్దం పట్టాయని.. మా ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సంతృప్తినిచ్చాయని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
దౌర్జన్యం చేస్తున్నామన్న ఆరోపణలు సరికాదని తేలిందని.. హింసకు చోటు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని సజ్జల పేర్కొన్నారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్ధతుదారులదే హవా అని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు 1,225 పంచాయతీల ఫలితాల్లో 1,009 చోట్ల వైసీపీ మద్ధతుదారులు విజయం సాధించారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ స్థాయిలో చూపించారని సజ్జల తెలిపారు.
158 పంచాయతీల్లో టీడీపీ, బీజేపీ 9, జనసేన 14, ఇతరులు 15 చోట్ల విజయం సాధించినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాలపై ఎన్నికల అధికారి గిరిజా శంకర్ మాట్లాడుతూ.. 4 విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
ఏకగ్రీవాలు కూడా 16 శాతానికే పరిమితమయ్యాయని గిరిజా శంకర్ పేర్కొన్నారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లే దాఖలు కాని చోట ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.
10 పంచాయతీలు, 670 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని ఆయన వెల్లడించారు. తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మొత్తం నాలుగు దఫాల్లో కలిపి 81.78 శాతం పోలింగ్ నమోదైందని గిరిజా శంకర్ పేర్కొన్నారు.