చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌పై అనుమానాలు.. జైలుకు వెళ్లకుండా వుండేందుకే ఈ డ్రామా : సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva Kodati  |  First Published Nov 16, 2023, 2:50 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్ట్‌పై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని ఆరోపించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మెడికల్ బోర్డ్‌లో చంద్రబాబు రిపోర్ట్‌లపై చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్ట్‌పై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని ఆరోపించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యంతో వున్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చని, న్యాయస్థానం అనుమతిస్తే బెయిల్ వస్తుందని చెప్పారు. వైద్యపరమైన కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చిందని సజ్జల తెలిపారు. ఇప్పుడు ఆ బెయిల్‌పై మరికొంతకాలం బయట వుండేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జైల్లో వున్నప్పుడు ప్రాణాంతక వ్యాధులున్నట్లు ప్రచారం చేశారని.. బెయిల్ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారని సజ్జల మండిపడ్డారు. ఏఐజీలో వున్నది వైద్యులా లేక రాజకీయ నేతలా అని ఆయన ప్రశ్నించారు. 

మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్ధితి వుంటే వెంటనే ట్రీట్‌మెంట్ ఇవ్వాలని రామకృష్ణారెడ్డి సూచించారు. డాక్టర్ల నుంచి అలాంటి రిపోర్ట్ తెచ్చుకోవడం చంద్రబాబు చాకచక్యంలా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులో వున్నా బయట వున్నా మాకేం ఇబ్బంది లేదని.. ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోందని సజ్జల పేర్కొన్నారు. ఈ స్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని .. చంద్రబాబు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 

Latest Videos

చంద్రబాబు లాగా  జైల్‌లో 70 ఏళ్ళు  దాటిన వారు  చాలా  మంది  ఉంటారని.. అందరికి ఇలా టెస్ట్ లు  చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు  జైల్‌లో  ఉండాలని  ఎవరు  కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను  మేనేజ్ చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయని సజ్జల ఆరోపించారు. మెడికల్ రిపోర్ట్‌ల విషయంలో అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మెడికల్ బోర్డ్‌లో చంద్రబాబు రిపోర్ట్‌లపై చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. 
 

click me!