
గవర్నర్ కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషెన్ రాజు, రమేశ్ యాదవ్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వీరితో ప్రోటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, సుచరిత, వనిత సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
అనంతరం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని తెలిపారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపించామని సజ్జల వెల్లడించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. ముగ్గురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశామని సజ్జల గుర్తుచేశారు. మైనార్టీలు, బీసీ, ఎస్సీలు కలిపి 14 మందిని కౌన్సిల్‌కు పంపామని ఆయన వెల్లడించారు.
Also Read:మీ బకాయిలు మేం కట్టాం.. 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేశారా: బాబుకు సజ్జల కౌంటర్
నామినేటెడ్ పదవుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలిలో మెజార్టీతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు తొలగాయని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ పాలసీ అమలు సులభతరమని సజ్జల చెప్పారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ఎంపికయ్యానని ఆయన అన్నారు. బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ నిరూపించారని రమేశ్ యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి తెచ్చిన నేత జగన్ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని మోషేన్ రాజు వ్యాఖ్యానించారు.