ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని.. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని.. ఎక్కువగానే లబ్ధి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్న విషయాన్ని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.
ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని.. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . ఉద్యోగ సంఘాల నేతలతో మంగళవారం ఆయన పీఆర్‌సీపై చర్చించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని.. ఎక్కువగానే లబ్ధి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్న విషయాన్ని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.
కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ... అయినప్పటికీ అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసిందని ఆయన పేర్కొన్నారు. సీఎస్ కమిటీ (cs committee) సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిదేళ్లు పడుతోందని.. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారని.. దీనిపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని, త్వరలోనే సీపీఎస్‌పై స్పష్టత వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Also Read:AP PRC : సజ్జలతో ముగిసిన భేటీ.. రేపు జగన్‌తోనే తేల్చుకుంటామన్న ఉద్యోగ సంఘాలు
అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన చర్చల అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ సిఫార్సులు ఏవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవని చెప్పామన్నారు. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని... రేపు ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 34 శాతంకు తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరామని... ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ రావడం సహజంగా వస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ అంగీకరించమని చెప్పామని... తమ డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్తామని సజ్జల హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరామని... 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కూడా కోరతామని ఆయన చెప్పారు. ఉద్యోగులు కోరుతోన్న విధంగా రేపు సీఎం ఫిట్ మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.