
జగన్ పాలనపై టీడీపీ ఛార్జ్ షీట్ వేయడం హాస్యాస్పదమన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి (parthasarathy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 35 లక్షల మంది నిరుపేదలకు జగన్ ఇంటి కల నెరవేర్చారని పార్థసారథి అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం.. ఘోరాలు, నేరాలు చేస్తోందని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంఘటలనను సంఘటనలుగానే చూడాలి తప్పించి.. దానిని ముఖ్యమంత్రికి ఆపాదించడం సరికాదని పార్థసారథి అన్నారు.
టీడీపీ అధికారంలో వున్నప్పుడు కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తల బిల్లులకే ప్రాధాన్యతను ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. కానీ రైతులకు సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సబ్సిడీలను ఎందుకు చెల్లించలేదని పార్థసారథి ప్రశ్నించారు. మాకు సంబంధం లేదని.. తుఫానుకు నష్టపరిహారం ఎగవేశారని ఆయన మండిపడ్డారు. ఈఎస్ఐ స్కామ్ చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్‌షీట్ విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు.
ప్రకృతి విపత్తులు జరిగి రైతులు నష్టపోతే 30 రోజుల్లో వారికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని పార్థసారథి తెలిపారు. ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తే తెలుగుదేశం పార్టీపైనే వేయాలన్నారు. ఐదేళ్ల పాలనలో మోసం, వంచన ఆధారంగానే పరిపాలన జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని పార్థసారథి ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలో వున్న ఐదేళ్లు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని పార్థసారథి మండిపడ్డారు.
కాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి (ysrcp) ప్రభుత్వ పాలన వెయ్యిరోజులకు చేరుకున్న సందర్బంగా ప్రతిపక్ష టిడిపి (tdp) ''వెయ్యినేరాలు-వెయ్యి ఘోరాలు'' ప్రజాఛార్జ్ షీట్ పేరుతో బుక్ లెట్ విడుదలచేసింది. ఈ బుక్ లెట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ (ys jagan) పై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి మూడేళ్లపాలన ప్రజలకు, రాష్ట్రానికి ఎవరూపూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని అన్నారు. విధ్వంసంతో మొదలైన జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేవరకు ప్రజలంతా కసితో, పట్టుదలతో ఈ ప్రభుత్వంపై పోరాడాలని టిడిపి పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (atchannaidu) మాట్లాడుతూ... వ్యవస్థల విధ్వంసం, ప్రజల దోపిడీ, రాజ్యాంగ ఉల్లంఘనలతో కేవలం మూడేళ్లలోనే జగన్ రెడ్డి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని దుర్మార్గాలు, దురాగతాలు చేశాడని మండిపడ్డారు. ఈ వెయ్యిరోజుల పాలనలో ఈ ముఖ్యమంత్రి చేసిన ఘోరాలు, విధ్వంసాలు, నేరాలు, లూఠీలు, అబద్ధాలకు అంతేలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెయ్యిరోజుల్లో చేస్తున్న దుర్మార్గాలు, నేరాలు,ఘోరాలను ప్రతిరోజూ ప్రజలకు చెబుతూనే ఉంది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ వాటన్నింటినీ మరోసారి ఏపీ ప్రజలకు, విజ్ఞులకు,మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, రాష్ట్రభవిష్యత్ బాగుండాలని కాంక్షించేవారికి తెలియచేయడానికే వెయ్యిరోజుల్లో వెయ్యి ఘోరాలు, నేరాలు పేరుతో బుక్ లెట్ విడుదల చేశాము'' అని పేర్కొన్నారు.