
తెలుగు సినీ పరిశ్రమపై (Telugu Film Industry) జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరి మారాలని అన్నారు. సినీ ఇండస్ట్రీ సీఎం జగన్‌కు సన్మానం చేయడానికి సిద్దంగా ఉందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. దేని కోసం సన్మానం చేస్తున్నారని ప్రశ్నించారు. వకీల్ సాబ్ చిత్రం అప్పుడు పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గించిందన్నారు. వినోదాన్ని పేదలకు అందుబాటులో తెస్తామన్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు రేట్లను పెంచిందన్నారు. మరి దీనికేం సమధానం చెబుతుందని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుతాననగానే సీఎం జగన్‌కు సన్మానం చేస్తానని చెప్పడం.. కామెడీ సీన్‌లా కనిపిస్తుందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని యువత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీ కార్యక్రమం చేసుకుంటుంటే అటంకాలు సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. జనసేన అవిర్భావ దినోత్సవ సభకు అనుమతి కోరుతున్న ఎలాంటి స్పందన లేదన్నారు. హైకోర్టులో జనసేన అవిర్భావ సభ పర్మిషన్ కోసం పిటిషన్ వేయబోతున్నామని చెప్పారు.
ఒక సినిమా ఫలితం అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. సినిమా బాగుంటే పదిసార్లు చూస్తారు.. లేకుంటే ఒక్కసారి కూడా చూడరని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానం మారాలని అన్నారు. ప్రతి వర్గానికి ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారని అన్నారు. సంక్షేమం పేరుతో విపరీతమైన దోపిడి జరుగుతుందని ఆరోపించారు. జనసేన అవిర్భావ సభకు పోలీసులు బందోబస్తు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని కోరారు.