విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ఈసారి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేను కాకపోయినా, సొంత ప్రభుత్వం కావడంతో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేయించి పలువురి దృష్టిని ఆకర్షించారు.
విజయవాడ కేంద్రంగా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో దేవినేని ఫ్యామిలీ ఒకటి. దివంగత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. అనంతర కాలంలో కాంగ్రెస్‌లోనూ తనదైన ముద్ర వేసిన నెహ్రూ.. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కానీ అనారోగ్యంతో ఆయన కొద్దిరోజులకే కన్నుమూశారు. తన కుమారుడు దేవినేని అవినాష్‌ను ఎమ్మెల్యేగా చూడాలని ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడుతో వున్న పాత వైరాన్ని కూడా పక్కనపెట్టి ఆయనతో చేతులు కలిపారు. కానీ తన కల నెరవేరకుండానే నెహ్రూ కన్నుమూశారు.
అయితే నెహ్రూ కోరిక మేరకు చంద్రబాబు అవినాష్‌ను ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపారు. కానీ అక్కడ బలమైన నేత కొడాలి నాని వుండటంతో అవినాష్ ఓటమిపాలయ్యారు. తదనంతర కాలంలో టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. తన కుటుంబానికి ఎంతో పట్టున్న విజయవాడ తూర్పు నుంచి బరిలో దిగాలని అవినాష్ భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా వున్న ఆయన.. నేతలను, కేడర్‌ను కలుపుకుపోతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
తన దూకుడు, క్రమశిక్షణతో అనతికాలంలోనే సీఎం జగన్ సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్ . తాను ఎమ్మెల్యేను కాకపోయినా, సొంత ప్రభుత్వం కావడంతో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేయించి పలువురి దృష్టిని ఆకర్షించారు. మొగల్రాజపురం, గుణదల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటి పట్టాలను అందించారు. కానూరు, రామవరప్పాడు మధ్య కొత్తగా రహదారిని ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించడంతో పాటు వారికి పరిహారం అందించారు. తన నియోజకవర్గ పరిధిలో కృష్ణా కరకట్టకు ఆనుకుని కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం అండదండలతో పాటు తన తండ్రి నెహ్రూ సన్నిహితులు, మిత్రుల ఆశీర్వాదంతో అవినాష్ దూసుకెళ్తున్నారు.
అంతా బాగానే వుంది కానీ .. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత , ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వున్నారు. 2019లో జగన్ సునామీని సైతం తట్టుకుని విజయం సాధించిన ఆయనకు అవినాష్ ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి. పెద్దగా మైనస్‌లు లేనప్పటికీ .. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి. మరి చూద్దాం ఏం జరుగుతోంది.