కుప్పంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. గ్రామస్థాయి నాయకులే టార్గెట్.. ఉలిక్కిపడుతున్న టీడీపీ..

Published : Jul 19, 2022, 09:59 AM IST
కుప్పంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. గ్రామస్థాయి నాయకులే టార్గెట్.. ఉలిక్కిపడుతున్న టీడీపీ..

సారాంశం

గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక  సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ వాహ కొనసాగిస్తుంది. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక  సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ వాహ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తమ లక్ష్యం మొత్తం 175 స్థానాలను గెలుచుకోవడేమేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు. అదేం పెద్ద కష్టం కాదని అంటున్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 

1989 నుంచి కుప్పం అసెంబ్లీ నియోజవర్గం ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపొందుతూ వస్తున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించడం ద్వారా టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై స్పెషల్ ఫోకస్‌ కేటాయించారు. నిత్యం కుప్పంలో పర్యటిస్తూ.. అక్కడి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాహ కొనసాగించడం.. టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. 

ఈ పరిణామాలతో కుప్పం నియోజవర్గంలోని వైసీపీ క్యాడర్‌లో మరింత జోష్ నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అలాగే కుప్పం ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు.. కుప్పం‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడి ప్రజల కోరిక మేరకు తాము కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశామని పదే పదే చెబుతున్నారు. 

ఈ పరిణామాలు టీడీపీ ఉలిక్కిపడేలా చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు నాయుడు.. ఇటీవల కుప్పంలో పలుమార్లు పర్యటించి నియోజవర్గంలోని స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించారు. ఈ క్రమంలోనే కొంతమంది వైసీపీకి చెందినవారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. 

అయితే మరోవైపు వైసీపీ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. టీడీపీకి ధీటుగా బదులిస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వంద మందికి పైగా టీడీపీ కార్యకర్తలను వైసీపీ పార్టీలో చేర్చుకుంది. ఇక, గత శనివారం మరో 244 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కుప్పున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

అయితే వైసీపీ నేతలు చెబుతున్నవి అసత్యాలు అని టీడీపీ ఆరోపిస్తుంది. ఇది అంతా నిజం కాదని.. వైసీపీలో చేరినవారు టీడీపీకి చెందిన వారు కాదని తెలిపారు. ‘‘కుప్పంలో టీడీపీ ఓడిపోతోందని చిత్రీకరించేందుకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ కేఆర్‌జీ భరత్‌ కొంత మందిని చిత్తూరుకు తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలుగా పరిచయం చేశారు. తమ టీడీ గుర్తింపు కార్డులను చూపించాలని మీడియా వారిని కోరగా.. వారంతా కార్డులు చూపించారు కానీ ఆ కార్డుల్లోని పేర్లు, ఫొటోలు వారివి కావు’’ అని టీడీపీ నాయకుడు ఒకరు తెలిపారు.

అయితే.. సీఎం జగన్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ నుంచి కొందరు తమ పార్టీలో చేరారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కేఆర్‌జీ భరత్‌ పేరును ప్రకటించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజవర్గం విషయంలో వైసీపీ ఎంత క్లియర్‌గా ఉందో స్పష్టతనిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్