మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన జగన్.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Oct 12, 2022, 9:58 PM IST
Highlights

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రావి వెంకటరమణను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా పార్టీ  కేంద్ర కార్యాలయం ప్రకటించింది. రావి వెంకటరమణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసినట్టుగా తెలిపింది. రావి వెంకటరమణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

ఇక, చాలా కాలంగా పొన్నూరు వైసీపీలో వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019లో పొన్నూరు నుంచి కిలారి రోశయ్యకు వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని రావి వెంకటరమణ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఆ ఎన్నికల్లో కిలారి రోశయ్య విజయం సాధించడంతో.. రావి వెంకటరమణ వర్గం మాట పెద్దగా చర్చకు రాలేదు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కిలారి రోశయ్య.. తమను పక్కనపెట్టారని రావి వెంకటరమణ వర్గం ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పొన్నూరు వైసీపీలో వర్గపోరు కొనసాగుతుంది. 

కిలారి రోశయ్య వర్గం, రావి  వెంకటరమణ వర్గాల మధ్య సాగుతున్న విబేధాలు తాజాగా మరోసారి భగ్గుమన్నాయి. పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై జరిగిన దాడిపై రావి వెంకటరమణ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దాడి ఎమ్మెల్యే వర్గీయుల పనేనని ఆరోపిస్తున్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటరమణ వర్గం ఆందోళనకు దిగింది. వైసీపీ శ్రేణుల నిరసన నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరక్కుండా పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. నిరససకు దిగిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులను సముదాయించి విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజే రావి వెంకటరమణను పార్టీ నుంచి వైసీపీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

click me!