తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా?.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Oct 12, 2022, 9:29 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి 25ఏళ్లు దాటిన షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసిస్తున్నారని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి 25ఏళ్లు దాటిన షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసిస్తున్నారని విమర్శించారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో , షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. కొడాలి నాని బుధవారం గుడివాడ ఐదో వార్డు శ్రీరామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులతో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  

ఈ క్రమంలోనే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గతిలేక అనేకసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ కాళ్ల దగ్గరే ఉండి ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు పార్టీ నడపడం చేతకాకపోతే.. చంద్రబాబు బయటకు పోవాలని.. కానీ ఆయన పార్టీ లాక్కోవడమేంటని? అన్నారు. ఎన్టీఆర్‌ను మించి ఆయన కొడుకు బాలకృష్ణ నటిస్తున్నారని.. చంద్రబాబుతో కలిసి షోలు చేస్తున్నారని విమర్శించారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడు చిల్లరకు ఆశపడుతున్నాడని ఆరోపించారు. కొందరు అమరావతి రైతులు, టీడీపీ ,జనసేన, తోక పార్టీలు చేస్తున్న పాదయాత్రకు విరుగుడే విశాఖలో జేఏసీ సభ అని అన్నారు. విశాఖ గర్జన బల ప్రదర్శన కాదని.. మూడు జిల్లాల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 2‌కు చంద్రబాబు గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏపిసోడ్ అక్టోబర్ 14న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ ఏపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ షోలో చంద్రబాబు వ్యక్తిగత విషయాలు, రాజకీయాలకు సంబంధించి పలు అంశాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 1995‌లో చోటుచేసుకన్న పరిణామాలపై చంద్రబాబు మాట్లాడినట్టుగా ప్రోమో ద్వారా అర్ధం అవుతుంది.   

click me!