బాబుది గజదొంగల ప్రభుత్వం: జగన్

First Published 9, Sep 2018, 5:39 PM IST
Highlights

చంద్రబాబునాయుడుది గజదొంగల ప్రభుత్వమని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విమర్శలు  గుప్పించారు. 


విశాఖపట్టణం: చంద్రబాబునాయుడుది గజదొంగల ప్రభుత్వమని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విమర్శలు  గుప్పించారు.  విశాఖలో  ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు అప్పనంగా కబ్జాలుచేస్తున్నారని  ఆయన ఆరోపించారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విశాఖ జిల్లా కంచరపాలెంలో ఆదివారం నాడు  నిర్వహించిన సభలో  టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విశాఖలో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జాలుచేశారని ఆయన  చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను  బాబు  ఇంతవరకు  అమలు చేయలేదన్నారు. 

 తనకు సంబంధం లేని భూములను బ్యాంకులో తాకట్టు పెట్టుకొని  మంత్రి గంటా శ్రీనివాసరావు రుణం తీసుకొన్నాడని ఆయన ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడి భూముల జోలికి సర్కార్ ఎందుకు వెళ్లలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విలువైన 9.1 ఎకరాల భూమిని లూలూ గ్రూపుకు చంద్రబాబునాయుడు అప్పనంగా అప్పజెప్పారని  చెప్పారు. 

బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నప్పుడు విశాఖలో రైల్వే జోన్, ప్రత్యేక హోదా మాత్రం చంద్రబాబునాయుడుకు గుర్తు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో ఎక్కడైనా  ఐటీ సిగ్నేచర్ టవర్ కన్పిస్తోందా అని ప్రశ్నించారు. విశాఖలోని విప్రో కార్యాలయంలో ఐదువేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటే కేవలం 250 మంది కూడ పనిచేయడం లేదన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విశాఖపట్టణం అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. కానీ, చంద్రబాబునాయుడు  అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి రివర్స్ గేర్ లో పరుగులు పెడుతోందన్నారు.

విశాఖలో పెట్టుబడులకోసం ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సుల్లో  లక్షలాది ఉద్యోగాలను  కల్పించినట్టు  చెబుతున్నా  ఆచరణలో మాత్రం అందుకు విరుద్దంగా సాగుతోందన్నారు. భాగస్వామ్య సదస్సుల్లో భోజనాల కోసమే సుమారు రూ.53 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.

Last Updated 9, Sep 2018, 5:39 PM IST