జేసీ నోరు అదుపులో పెట్టుకో..: ప్రభాకర్ చౌదరి సంచలనం

By narsimha lodeFirst Published Sep 9, 2018, 4:51 PM IST
Highlights

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై  అనంతపురం ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివాకర్.. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు


అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై  అనంతపురం ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివాకర్.. నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను బెదరబోనని తేల్చి చెప్పారు.

మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున  ప్రభాకర్ చౌదరి ఈ విషయమై స్పందించలేదు.  శనివారం నాడు  తన క్యాంపు కార్యాలయంలో  దివాకర్ రెడ్డిపై  ప్రభాకర్ చౌదరి రెచ్చిపోయారు. 

పదవులు, ప్రాణం ముఖ్యం కాదని, తనకు పరువే ముఖ్యమన్నారు. సామాజిక సేవ చేయడానికి అవే సంస్థ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పీస్‌ మెమోరియల్‌ హాల్‌ను పేకాటక్లబ్‌గా మార్చారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పేకాటే నడుస్తూండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక శాంతిచిహ్నాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఎన్టీఆర్‌ మ్యూజియంగా మార్చినట్టు చెప్పారు . అది తప్పా..?’ అని ప్రశ్నించారు. 

జేసీ దివాకర్ రెడ్డి పార్టీలోకి రాకముందే  అనంతపురం నగరంలో అత్యధిక వార్డులను టీడీపీ కైవసం చేసుకొందని ఆయన గుర్తు చేశారు. అనంతపురంలో ఎంపీగా జేసీకి 4 వేల మెజారిటీ వస్తే తనకు 9వేల మెజారిటీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

పార్టీ కోసం క్రమశిక్షణతో ఇంతవరకూ ఓపిగ్గా ఉంటున్నానన్నారు. ఇప్పుడు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అబ్బా..అమ్మా అంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధమన్నారు.

నాకు చావంటే భయం లేదు.. నేనూ రాయలసీమలోనే జీవిస్తున్నా.. నీవు పార్టీకి ఎంత అవసరమో.. మేము కూడా అంతే అవసరం. భయపడే ప్రసక్తే లేదు. మేము రాజకీయాల్లోకి రాకూడదా..? ప్రజాప్రతినిధులు కావడం తప్పా..?’ అని ప్రశ్నించారు. 

మీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని చెప్పారు. తాను  కూడా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోవాలని జేసీని ప్రభాకర్ చౌదరి   హెచ్చరించారు.

click me!