వైఎస్సార్‌ జయంతి స్పెషల్‌: వైఎస్సార్‌ చేసిన 10 మంచి పనులు.. యూత్‌లో అందుకే క్రేజ్‌!

By Galam Venkata RaoFirst Published Jul 8, 2024, 8:05 AM IST
Highlights

దేశ భవిష్యత్‌ యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మేవారు. అందుకే విద్యార్థులు, యువత కోసం అనేక  పథకాలు, నిర్ణయాలు అమలు చేశారు. భవిష్యత్తును బంగారంగా మలిచేందుకు పాటుపడి.. యుతకు చుక్కానిలా మారారు...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి నేడు. ఆయన తనయుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాయి. అలాగే, వైఎస్‌ తనయి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2004-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి యువత కోసం చేసిన 10 మంచి పనులేంటో తెలుసుకుందాం...

దేశ భవిష్యత్‌ యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మేవారు. అందుకే విద్యార్థులు, యువత కోసం అనేక  పథకాలు, నిర్ణయాలు అమలు చేశారు. భవిష్యత్తును బంగారంగా మలిచేందుకు పాటుపడి.. యుతకు చుక్కానిలా మారారు...

Latest Videos

01. మంచి చదువు లభిస్తే విద్యార్థుల జీవితాలు మెరుగుపడతాయని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మారు. అందుకే జాతీయ స్థాయి విద్యా సంస్థ ఐఐటీని మెదక్‌ జిల్లా కందిలో ఏర్పాటు చేయించారు. అలాగే కృష్ణా జిల్లా నూజివీడు, వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ, ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక బిట్స్‌ పిలానీ విద్యా సంస్థ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయగలిగారు. ఈ విద్యా సంస్థలకు మౌళిక వసతులు కల్పించేందుకు భూములు, నిధుల్ని సమకూర్చారు. 

02. సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్‌ కాలేజీల ఏర్పాటుని ప్రోత్సహించారు. అటు, ప్రభుత్వ రంగంలో జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10లోపు విశ్వ విద్యాలయాలు మాత్రమే ఉంటే... ఒక్క వైఎస్‌ఆర్‌ హయంలోనే 17 విశ్వవిద్యాలయాల్ని స్థాపించారు. దాదాపు ప్రతి జిల్లాలో యూనివర్శిటీని రప్పించి ఉన్నత విద్యను ప్రజల ముంగిట్లో నిలిపారు. 

03. బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు అబ్బితే ఆయా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నమ్మకం. అందుకే ఆయా వర్గాల పిల్లలకు స్కాలర్‌షిప్పులు పెంచటంతో పాటు గురుకులాలు, హాస్టల్స్‌ను పెంచారు. ఆ తర్వాత కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేద పిల్లలు ఊహించలేని విధంగా ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందితే, ఫీజులు ప్రభుత్వం భరించేలా నిర్ణయం అమలు పరిచారు. దీంతో బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్‌ విద్యను అభ్యసించేందుకు వీలు కలిగింది. దీని కింద 11లక్షల మంది బీసీ వర్గాలు, 5లక్షల మంది ఎస్సీ వర్గాలు, 1.8లక్షల మంది ఎస్టీ వర్గాలు, 7.4లక్షల మంది మైనార్టీలు, 7లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రయోజనం దక్కింది. ఒక్క 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,500 కోట్లు వెచ్చించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. 

04. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు జవసత్వాలు కల్పించారు. పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 17వేల పోలీసు నియామకాలు, 50వేల టీచర్‌ నియామకాలు జరిగాయి. 

05. వైఎస్‌ఆర్‌ హయాంలో జల యజ్ఞం పెద్ద ఎత్తున జరగటంతో లక్ష మందికి ఉపాధి దొరికింది. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం కిందనే 38 వేల మందికి ఉపాధి లభించింది. 

06. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లను క్రమబద్దీకరణ చేయటంతో పెద్ద ఎత్తున నియామకాలకు అవకాశం ఏర్పడింది.

07. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవ చూపించారు. రాజీవ్‌ ఉద్యోగశ్రీ పథకం కింద నైపుణ్యాల కల్పనకు మార్గం సుగమం చేశారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. వివిధ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి ఉపాధి మార్గాల్ని సరళతరం చేశారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించి ఉపాధి మార్గాల్ని వేగవంతం చేశారు. 2004–2008 మధ్య కాలంలో 2.14 లక్షల ఉద్యోగాల్ని కల్పించారు.

08. ప్రత్యేక ఆర్థిక మండళ్లను విరివిగా మంజూరు చేశారు. వీటిల్లో పూర్తిగా పారిశ్రామిక యూనిట్లను స్థాపిస్తే దాదాపు 25లక్షల ఉద్యోగాలు ఏర్పడుతాయని అంచనా. 

09. వైయస్‌ఆర్‌ చొరవతో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఉత్పాదన రంగం కళకళలాడాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు సుగమం అయ్యాయి.

10. దివంగత వైఎస్‌ఆర్‌ హయంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు కళకళ లాడాయి. 2005లో నూతన ఐటీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని విజయవంతంగా అమలు చేయటంతో ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ తో పాటు విశాఖ, తిరుపతి, వరంగల్‌ , విజయవాడల్లో ఐటీని వేగవంతం చేశారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ వృద్ధి రేటు 32 శాతం ఉంటే, ఏపీలో 41శాతం సాధించారు. ఐటీ కంపెనీలను ప్రోత్సహించటంతో సేవ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని కల్పించారు.

click me!