వైఎస్సార్ జయంతి స్పెషల్: వైఎస్ వంశ వృక్షమిదే.. అవినాశ్‌ రెడ్డి భారతికి బావ ఎలా అయ్యాడంటే..?

By Galam Venkata Rao  |  First Published Jul 7, 2024, 6:00 PM IST

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్వికులది కడప జిల్లా పులివెందుల తాలూకాలోని బలపనూరు గ్రామం. రాజశేఖరరెడ్డి ముత్తాత పేరు యెడుగూరి పుల్లా రెడ్డి, ఆయన భార్య పేరు అచ్చమ్మ. పుల్లా రెడ్డి-అచ్చమ్మల కొడుకైన వెంకటరెడ్డికి మొత్తం 10 మంది సంతానం.


వైఎస్సార్.. యెడుగూరి సందింటి రాజశేఖర్‌ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. వృత్తిపరంగా వైద్యుడైన రాజశేఖర్‌ రెడ్డి.. రాజకీయాల్లోకి ప్రవేశించి అనేక పదవులు అధిరోహించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్‌... 2009లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. 

అప్పటికే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించారు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాల బ్రాండ్‌తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. అలా.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అఖండ విజయం సాధించగా.. జగన్‌ తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో దారుణంగా ఆయన పార్టీ ఓడిపోగా... ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 

Latest Videos

అయితే, వైఎస్సార్‌ కుటుంబం నుంచి చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యేక్షంగా కొందరు లేకపోయినా... వెనక నుంచి వారికి మద్దతు ఇస్తుంటారు. కాగా, వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి, జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఎంతో కష్టపడిన ఆయన సోదరి వైఎస్‌ షర్మిల దూరంగా జరిగారు. కుటుంబ, వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడిన ఆమె తొలుత తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించారు. దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల.. ఏపీలో జగన్‌ ఓటమికి ఓ కారణమని చెప్పవచ్చు. 

అలాగే, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా జగన్‌ ఓటమికి మరో కారణమని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యను రాజకీయం చేసి వైసీపీ అధికారంలోకి రాగా.. ఆ తర్వాత అదే అంశాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేశాయి ప్రతిపక్షాలు. ఇక, ఈ ఎన్నికల ముందు వైఎస్‌ షర్మిలతో పాటు వివేకా కుమార్తె సునీత ఈ హత్య అంశాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. వివేకాను ఎవరు చంపారో నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్‌, అవినాష్‌ రెడ్డిలను షర్మిల, సునీత వ్యతిరేకిస్తే... వీరిద్దరిని అదే కుటుంబంలోని మిగతా సభ్యులు వ్యతిరేకించారు. 

సరిగ్గా 20 ఏళ్ల వ్యవధిలో తండ్రీకొడుకులిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వైఎస్సార్‌ రెండుసార్లు (2004, 2009) ముఖ్యమంత్రి అయితే, జగన్‌ ఒకసారి ముఖ్యమంత్రి అయి రెండోసారి ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని ఆ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. 

మరోవైపు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ బలహీన పడిన ఈ తరుణంలో వైఎస్సార్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారే నిజమైన వారసులం మేమేనని చెప్పుకొంటున్నారు. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ వంశం గురించి ఓ లుక్కేద్దాం రండి.. అసలు వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి..? ఎక్కడ ప్రారంభమై.. ఎలా ఎదిగారు..? క్రిస్టియానిటీలోకి ఎలా మారారన్న ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చదివేద్దాం...

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్వికులది కడప జిల్లా పులివెందుల తాలూకాలోని బలపనూరు గ్రామం. రాజశేఖరరెడ్డి ముత్తాత పేరు యెడుగూరి పుల్లా రెడ్డి, ఆయన భార్య పేరు అచ్చమ్మ. పుల్లా రెడ్డి-అచ్చమ్మల కొడుకైన వెంకటరెడ్డికి మొత్తం 10 మంది సంతానం. వారిలో ఐదుగురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు. వారిలో ఆరో సంతానంగా రాజారెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాతైన వెంకటరెడ్డి వేంకటేశ్వరస్వామి వీర భక్తుడు. ఆయన మేనమామ చిన కొండారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచి వెంకటరెడ్డి సీస పద్యాలు రాసేవారు. నిత్యం ఓం నమఃశివాయ అంటూ పంచాక్షరీ మంత్రం జపించేవారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చదువును మధ్యలోనే వదిలేశారు. తండ్రి పుల్లారెడ్డితో కలిసి వ్యవసాయం చేశారు. వెంకటరెడ్డి మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో మంగమ్మతో రెండో వివాహం జరిగింది. వారిద్దరికీ రాజారెడ్డితో సహా 10 మంది సంతానం కలిగింది. 

కాగా, భారమైన సంతానంతో 1933లో వెంకటరెడ్డి బలపనూరు నుంచి పులివెందులకు వలస వచ్చారు. ఆ సమయంలోనే క్రిస్టియన్ మెషినరీల సహాయంతో గంపెడు సంతానాన్ని పోషించుకున్నారు. అలా రాజశేఖరరెడ్డి తాత తొలిసారిగా కుటుంబంలో క్రైస్తవాన్ని స్వీకరించారు. 

కాస్త ఆర్థికంగా సర్దుకున్న తర్వాత వెంకటరెడ్డి పులివెందులలో బత్తాయి సాగు ప్రారంభించారు. తర్వాత కర్ణాటకలోని జోగ్ అనే జలపాత ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. తండ్రి వెంకటరెడ్డికి కాంట్రాక్టు పనుల్లో రాజారెడ్డి సహాయపడేవారు. అలా నెమ్మదిగా ఆర్థిక పరిస్థితులు మెరుపడ్డాయి. పిల్లలందరూ కుమార్తెలతో సహా ఉన్నత చదువులు చదివారు. రాజారెడ్డి సోదరి సుగుణమ్మ కడప జిల్లాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందారామె.

అలా, కాలక్రమేణా దశతిరిగి వైఎస్‌ వెంకటరెడ్డి 120 ఎకరాలు కొనే స్థాయికి చేరుకున్నారు. స్వయానా మేనకోడలైన జయమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం కలిగింది. వారిలో రెండో సంతానం వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన తరువాత మూడో సంతానంగా వివేకానందరెడ్డి జన్మించారు. 

రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కాగా, రాశేఖర్ రెడ్డికి జగన్, షర్మిల సంతానం, వివేకాకు సునీత ఒక్కరే కుమార్తె. 

కాగా, వైఎస్సార్ తాత వెంకట రెడ్డికి రెండో భార్య మంగమ్మతో పది సంతానం కలగగా.. మొదటి భార్య లక్ష్మితో ఒకరు సంతానం కలిగారు. ఆయనే చిన కొండారెడ్డి.

రాజారెడ్డికి నలుగురు కుమారులు జార్జిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, వివేకానందరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, ఒక కుమార్తె విమలమ్మ. 

చిన కొండారెడ్డికి పది మంది సంతానం కలగగా... వారిలో 6వ కూతురు సుగుణమ్మ, 9వ కుమారుడు వైఎస్ భాస్కర్‌ రెడ్డి అందరికీ తెలుసు. సుగుణమ్మ, భాస్కర్‌ రెడ్డి కుండ మార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. సుగుణమ్మ- ఈసీ గంగిరెడ్డిలకు భారతి కుమార్తె. భాస్కర్‌ రెడ్డి-లక్ష్మమ్మలకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కుమారుడు. ఇలా భారతి, అవినాష్‌ రెడ్డి వరసకు మేన బావామరదళ్లు.

ఇక, వైఎస్ జగన్-భారతీ దంపతులకు హర్ష, వర్ష అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్ షర్మిల-అనీల్ కుమార్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డికి ప్రియా అట్లూరితో ఇటీవల వివాహం కాగా, కుమార్తె అంజలికి పెళ్లి కాలేదు.

click me!