జనసేన కార్యకర్తలకు పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

By Galam Venkata Rao  |  First Published Jul 7, 2024, 8:24 PM IST

జనసేన శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పని తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా  కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులుగాని, కార్యకర్తలుగాని పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అటువంటివారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలుత షోకాజ్ నోటీసు జారీ అవుతుందని తెలిపారు. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అందువల్ల జనసేనలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకువెళ్లే విధంగా నడుచుకోవాలని కోరారు.

Latest Videos

click me!