చంద్రబాబు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ యాక్టర్ చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ నటిస్తారంటూ చేసిన ప్రచారం ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ప్రచారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ. మరి దాన్ని జనసేన పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
విశాఖపట్నం: ఏపీ రాజకీయాల్లో జనసేన సత్తా ఏంటో నిరూపించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇసుక కొరత అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించారు పవన్ కళ్యాణ్.
లాంగ్ మార్చ్ ను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని రాజకీయాల్లో జనసేన పవర్ ఏంటో నిరూపించాలని ఆ పార్టీ భావిస్తోంది. లాంగ్ మార్చ్ సక్సెస్ అయితే ప్రభుత్వం మెడలు వంచొచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
undefined
ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రభుత్వంపై లాంగ్ మార్చ్ పేరుతో గురిపెట్టినప్పటికీ అది రాజకీయంగా జనసేన మనుగడకు ఒక సవాల్ అంటూ ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకోగలిగింది జనసేన. రెండు చోట్లు పోటి చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బొక్కబోర్లాపడ్డారు.
ఎన్నికలు అయిన తర్వాత పార్టీకి కీలక నేతలు రాజీనామా చేయడంతో కార్యకర్తలు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు నూతనుత్సాహం నింపేందుకు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తూ క్లాస్ పీకుతున్నప్పటికీ కార్యకర్తల్లో మాత్రం ఎక్కడో కాస్త నిరుత్సాహం వెంటాడుతూనే ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ఇసుక కొరతపై పోరాటంతోనైనా తమ సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. దాంతో జనసేన పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు.
ప్రస్తుతం ఇసుక కొరత అంశంపై జనసేన పార్టీ ఇచ్చిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేస్తే కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంటుందని, పార్టీ వీడి వెళ్లాలనుకునే వారు కూడా ఆగిపోతారని పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు.
లాంగ్ మార్చ్ సక్సెస్ అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేన పార్టీకి కాస్త గౌరవ ప్రదమైన స్థానాలు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసి జనసేనను దెబ్బతీసిందో అదే ప్రచారాన్ని మళ్లీ ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
విశాఖ లాంగ్‌మార్చ్‌కి పవన్ కళ్యాణ్ ప్రధాన పార్టీలను కూడగట్టడం కొత్తగా ఉందని ఎద్దేవా చేశారు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు కలిసే ఉన్నాయి కదా ఇంకా కూడగట్టే ప్రయత్నం ఏంటని నిలదీశారు. ఫోన్లు చేయడం ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్.
గత ఎన్నికల్లో జనసేనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శల్లో ప్రధానంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది...టీడీపీ జనసేన ఒక్కటేనన్న ప్రచారం. చంద్రబాబు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ యాక్టర్ చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ నటిస్తారంటూ చేసిన ప్రచారం ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ప్రచారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ. మరి దాన్ని జనసేన పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఇసుక కొరతపై పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్: జనసేనకు కీలక నేత ఝలక్
మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం