బ్రాండ్ హైదరాబాద్: చంద్రబాబు పాటను అందుకున్న వైఎస్ జగన్

By telugu teamFirst Published Nov 2, 2019, 10:24 AM IST
Highlights

హైదరాబాద్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాటను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సభలో ఆయన తాము పడిన శ్రమంతా హైదరాబాదులోనే ఉండిపోయిందని వ్యాఖ్యానించారు.

విజయవాడ: హైదరాబాదు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాటను అందుకున్నారు. హైదరాబాదును తామే అభివృద్ధి చేశామని, హైదరాబాదు వదిలేసి కట్టుబట్టలతో వచ్చేశామని చంద్రబాబు ఎల్లవేళలా చెబుతుంటారు. ఆ ధోరణినే వైఎస్ జగన్ తాజాగా ప్రదర్శించారు. 

రాష్ట్ర విడిపోతుందని ఎవరూ ఊహించలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పడిన శ్రమంతా హైదరాబాద్ లోనే ఉండిపోయిందని జగన్ అన్నారు. విజయవాడలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. నష్టపోయిన ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇప్పుడు మనందరి ముందు ఉన్న ఏకైక లక్ష్యం అభివృద్ధేనని ఆయన అన్నారు. పరిశ్రమలు ఇతరత్రా చెన్నై, హైదరాబాదుల్లోనే ఉండిపోయాయని అన్నారు. దెబ్బ తిన్నప్పటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా పునర్నిర్మిస్తామని ఆయన చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. కష్టపడుతున్నామని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు.

నవంబర్ 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేపడుతూ వచ్చారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను ఆయన నిర్వహించలేదు. అయితే, వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం, నిజాం నవాబు నుంచి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డాయి. తెలుగు ప్రజలందరికీ కలిపి ఉమ్మడి రాష్ట్రం ఉండాలనే డిమాండ్ తలెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రాల విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవతరణ దినం కాబట్టి నవంబర్ 1వ తేదీని చంద్రబాబు అవతరణ దినోత్సవం నిర్వహించలేదు. 

click me!