తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ స్కెచ్: వ్యూహాత్మకంగా సీట్ల సర్ధుబాటు

By Nagaraju TFirst Published Dec 23, 2018, 2:25 PM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైసీపీ నాయకత్వం. సామాజిక వర్గాల వారీగా గెలుపు గుర్రాలపై దృష్టి సారించింది. 2014 ఎన్నికల నాటి వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిన వైసీపీ 2019 ఎన్నికలకు మాత్రం కీలక మార్పులు చేస్తూ ముందుకు వెళ్తోంది. 

కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైసీపీ నాయకత్వం. సామాజిక వర్గాల వారీగా గెలుపు గుర్రాలపై దృష్టి సారించింది. 2014 ఎన్నికల నాటి వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిన వైసీపీ 2019 ఎన్నికలకు మాత్రం కీలక మార్పులు చేస్తూ ముందుకు వెళ్తోంది. 

2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని భావించిన వైసీపీ తీరా ఫలితాల్లో బొక్క బోర్లా పడింది. అనుకున్న సీట్లు రాలేదు. దీంతో ఈసారి అలాంటిది పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 

అలాగే జిల్లాలో జనసేన ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కాపు సామాజికర్గం ఓటర్లు జనసేనవైపుకు వెళ్లిపోకుండా ఉండేందుకు వారి ఓటర్లను ఆకర్షించేందుకు ఏకంగా 7 స్థానాలు కాపులకు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 

జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు ఎస్సీ రిజర్వు స్థానాలు  కాగా ఒక ఎస్టీ  మిగిలిన 15 స్థానాలను చాలా వ్యూహాత్మకంగా కేటాయిస్తున్నారు. మిగిలిన 15 సీట్లలో ఏడు కాపు సామాజికవర్గానికి, ఐదు బీసీలకు, మూడు రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అయితే తూర్పుగోదావరి జిల్లాలో బీసీ సామాజికవర్గం కూడా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి రెండు స్థానాలను అదనంగా ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్. గత ఎన్నికల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించగా ఈసారి మరో రెండు స్థానాలు కలుపి మెుత్తం 5 స్థానాలను బీసీలకు ఇవ్వనున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో ఆయా సామాజికవర్గాలను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు వైఎస్ జగన్. ఓటు బ్యాంకు కీలక అంశంగా చేసుకుని ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. 

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో నాలుగు తూర్పుగోదావరి జిల్లాలోనూ మూడు పశ్చిమగోదారి జిల్లాలో ఉన్నాయి. 

తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల విషయానికి వస్తే అనపర్తి నియోజకవర్గం ఒక్కటి. ఈ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బరిలో నిలవనున్నారు. 

ఇకపొతే మిగిలిన మూడు నియోజకవర్గాలలో రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం సీట్లను కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే రాజమహేంద్రవరం అర్బన్‌ బీసీ వర్గానికి చెందిన తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ప్రయత్నిస్తోంది.  గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన రౌతు సూర్యప్రకాశరావు మళ్లీ పోటీ చెయ్యనున్నారు. 

రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థిగా ఆకుల వీర్రాజును ఎంపిక చెయ్యనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆకుల వీర్రాజు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో అత్యధికశాతం కాపు ఓటర్లు జనసేన వైపు మెుగ్గు చూపుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆ ఓట్లను దక్కించుకునేందుకు వీర్రాజు ను తప్పించి మరో కొత్తముఖాన్ని బరిలోకి దించే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి విజయలక్ష్మీ లేదా ఆమె తనయుడు జక్కంపూడి రాజా బరిలో నిలవనున్నారు. 

అటు పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిస్థితి చూస్తే గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడ్ కాగా నిడదవోలు జనరల్ స్థానం. అయితే నిడదవోలు స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ భావిస్తోందని సమాచారం. అలా అయితే జీఎస్‌ శ్రీనివాసనాయుడు బరిలో నిలిచే అవకాశం ఉంది. 
 
అంటే రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు టిక్కెట్లు కాపు సామాజిక వర్గానికి, రెండు ఎస్సీ సామాజిక వర్గానికి, ఒక స్థానం బీసీ తూర్పుకాపులకు, ఒక స్థానం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే కాకినాడ లోక్ సభ పరిధిలోనూ కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం మెుత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కోనియోజకవర్గం వారీగా పరిశీలిస్తే కాకినాడ అర్బన్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బరిిలో నిలిచే అవకాశం ఉంది. 

కాకినాడ రూరల్ నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాయే తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పెద్దాపురం టిక్కెట్ ఎవరికి కేటాయింలన్న దానిపై స్పష్టత రాలేదు. 

అయితే తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు స్థానాలను బీసీలకు కేటాయించింది. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, తుని బీసీలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు.

దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఈసారి బీసీలకు కేటాయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా యాదవ సామాజిక వర్గం ఉంటున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించాలని యోచిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నక్కెళ్ల బాబూరావు పేరు తెరపైకి వచ్చింది. 

ఇకపోతే  అమలాపురం లోక్ సభ పరిధిలోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో మూడు ఎస్సీ రిజర్వుడ్ కాగా ఒకటి బీసీ మిగిలినవి జనరల్ స్థానాలు. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా కాపులకు కేటాయించే అవకాశం లేనట్లు చెప్తోంది వైసీపీ కార్యాలయం. 

అమలాపురం నియోజకవర్గం నుంచి మాజీమంత్రి పినిపే విశ్వరూప్ బరిలో ఉండగా, పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, రాజోలు నియోజకవర్గం నుంచి బొంతు రాజేశ్వరరావులు ఈసారి బరిలో నిలచే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు పోటీచేసి ఓటమిపాలయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రెడ్డి సామాజికవర్గానికే కేటాయించింది. 

ప్రస్తుత ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు. అటు ముమ్మిడివరం నియోజకవర్గంలో కీలక మార్పులు చేసింది వైసీపీ నాయకత్వం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గంలోని శెట్టిబలిజ కులానికి కేటాయించింది. గుత్తుల సాయి ఓటమి పాలయ్యారు. 

దీంతో ఈసారి ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మండపేట నియోజకవర్గంలో కూడా మార్పులు చేశారు వైఎస్ జగన్. మండపేట టిక్కెట్ ఈసారి శెట్టిబలిజలకు ఇవ్వాలని భావిస్తున్నారు. 

దీంతో మండపేట నియోజకవర్గ సమన్వయకర్త పితాని అన్నవరం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రామచంద్రపురం నియోజకవర్గం కూడా శెట్టిబలిజలకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ జెడ్పీ చైర్పర్సన్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బరిలోనిలిచే అవకాశం ఉంది. 

అటు పార్లమెంట్ సీట్ల కేటాయింపుల్లోనూ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది వైసీపీ. తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాటిలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం. వీటిలో అమలాపురం ఎస్సీ రిజర్వుడ్ కాగా మిగిలిన రెండు జనరల్. ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ వైసీపీ చాలా వ్యూహాత్మకంగానే వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. 
 
కాకినాడ లోక్ సభ స్థానం కాపులకు కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన చలమల శెట్టి సునీల్ కు టిక్కెట్ ఇచ్చింది. అయితే చలమల శెట్టి సునీల్ పార్టీకి దూరమైన నేపథ్యంలో అదేసామాజిక వర్గానికి చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారికి ఇవ్వాలని ప్రయత్నాలు జరగుతున్నాయి. 

అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి సతీమణి అనూరాధ బరిలో దించే అంశంపై ఆమె పేరును పరిశీలిస్తోంది అధిష్టానం. ఇటీవలే ఆమె జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే జగన్ ఆమెను అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఆమెనే అక్కడ నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అటు రాజమహేంద్రవరం లోక్ సభ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే సినీనటుడు మార్గాని భరత్ ను పార్టీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన బొడ్డు భాస్కరరామారావు తనయుడుని బరిలోకి దించారు. అయితే అతను ఓటమి పాలయ్యారు. 

తెలుగుదేశం పార్టీ కూడా కమ్మ సామాజికవర్గానికే ఈ టిక్కెట్ కేటాయిస్తోంది. గతంలో సినీనటి జయప్రద తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గానికే టిక్కెట్ ఇస్తుంది. గత ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన మాగంటి మురళీ మోహన్ గెలుపొందారు. 

అయితే వైసీపీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది. అయితే గత ఎన్నికల్లో దెబ్బతినడంతో ఈసారి అలాకాకుండా ఉండేందుకు ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని జగన్ యోచిస్తున్నారు. అయితే ఆయా సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులు ఎంపికలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ సామాజిక వర్గాల అంచనాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. మరి ఎన్నికల సమయానికి ఎలాంటి మార్పులు చేర్పులు  జరుగుతాయో వేచి చూడాలి. 
 

click me!