జగన్ స్టైలు మారింది... ఆ నడక మారిందీ..!! 

By Arun Kumar P  |  First Published Jul 4, 2024, 5:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరికొత్తగా డ్రెస్సింగ్ లో ఆయన ఎలా కనిపిస్తున్నారో చూడండి... 


YS Jaganmohan Reddy : ఎన్నికల్లో ఓటమితర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కాస్త మాజీ అయిపోయారు... ఐదేళ్లుగా అధికారం చెలాయించిన ఆయన ఒక్కసారిగా అన్ని పవర్స్ కోల్పోయారు... 151 సీట్ల నుండి 11 సీట్లకు బలం పడిపోయింది... ఇలా వైఎస్ జగన్ రాజకీయంగా చాలా దెబ్బ తిన్నాడు. చివరకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనను గుర్తించే పరిస్థితి లేదు... ఇలాంటి పరిస్థితి వస్తుందని జగన్ అస్సలు ఊహించివుండరు. 

రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ వైఎస్ జగన్ సమస్యల వలయంలో చిక్కుకుని వున్నారు. సొంత చెల్లి వైఎస్ షర్మిల జగన్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారారు... కన్నతల్లి విజయమ్మ అతడికి కాకుండా కూతురుకి మద్దతుగా నిలిచారు. ఇక బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసు అతడిని వెంటాడుతోంది... భార్య వైఎస్ భారతిపైనా ఈ హత్యకేసులో ఆరోపణలు వస్తున్నాయి. బాబాయ్ కూతురు అంటే చెల్లి సునీత అన్న జగన్ తీరును తప్పుబడుతోంది. ఇలా రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ వైఎస్ జగన్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

Latest Videos

ఇలా రాజకీయంగా బలహీనపడి, వ్యక్తిగతంగా సమస్యలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ట్రోల్స్, మీమ్స్ పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఆయన సరికొత్త వేషధారణలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ తెల్ల షర్ట్, మామూలు ప్యాంట్ తో సాధారణంగా కనిపించే జగన్ తాజాగా కుర్తాలో కనిపించారు. ఇలా జగన్ సరికొత్తగా కనిపిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి... ఇంకేముంది ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్తలుక్ అదిరిపోయిందంటూ వైసిపి శ్రేణులు, ఆయనను అభిమానించేవారు అంటుంటే... ప్రత్యర్థులు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి,  జనసేన సోషల్ మీడియా పేజీల్లో జగన్ ఫోటోపై ట్రోలింగ్, మీమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఏంటీ... వైఎస్ జగన్ శాంతిదూతలా మారిపోయాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలను చూడగానే రాజకీయాలపైనే కాదు జీవితంపై విరక్తి పుట్టిందని... హిమాలయాలకు వెళ్లాలని అనిపించిందంటూ జగన్ కామెంట్ చేసారు. దీంతో హిమాలయాలకు వెళ్లేముందు ఇలాగే తయారవుతారేమోనంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇటీవల స్టైలు మారింది... నా నడక మారింది అంటూ ఓ మహిళ పాడిన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది... ఈ పాటను జగన్ కు అన్వయిస్తూ స్టైలు మారింది... జగన్ నడక మారింది అంటూ మీమ్స్ చేస్తున్నారు. 

మొత్తంగా ఎన్నికల్లో ఓటమితర్వాత జగన్ ఇలా కొత్తలుక్ లో కనిపించడం చర్చకు దారితీసింది. ఇంట్లో వుండే సమయంలో ఇలాంటి డ్రెస్ కాకుంటే ఖద్దరు చొక్కాలు వేసుకుంటారా అంటూ జగన్ లుక్ పై ట్రోల్ చేస్తున్నవారికి వైసిపి  శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. గత ఐదేళ్లు ప్రజాసేవలో మునిగిన ఆయన ఇప్పుడు కుటుంబంతో గడుపుతున్నారని... దీన్ని కూడా రాజకీయం చేయడం, వేషధారణపై ఎగతాళి చేయడం తగదని అంటున్నారు. 

వైఎస్ జగన్ డ్రెస్సింగ్ స్టైల్ : 

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా కుర్తాలో కనిపించడంతో గతంలో ఆయన డ్రెస్సింగ్ ను గుర్తుచేసుకుంటున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఖద్దరు చొక్కా వేయాల్సిందే... ఎప్పుడూ తెల్లటి షర్ట్ తో కనిపిస్తుంటారు. కానీ వైఎస్ జగన్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఇలా ఖద్దరు ధరించకుండా రంగురంగుల దుస్తులు ధరించేవారు. అప్పుడప్పుడు ట్రెండీ గళ్ల చొక్కాలు కూడా ధరించేవారు. ఇలా ఫక్తు రాజకీయ నాయకుడిలా కాకుండా యూత్ ఐకాన్ లా తమ నాయకుడు వుంటాడని వైసిపి నాయకులు చెప్పుకునేవారు. 

అయితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ స్టైల్ మార్చారు... ఎప్పుడూ ఒకే వేషధారణలో కనిపించేవారు. తెల్లటి షర్ట్, మామూలు లైట్ కలర్ ప్యాంట్ ధరించే ఎక్కువగా కనిపించేవారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా... పార్టీ సభలైనా ఎలాంటి ఆర్భాటానికి పోకుండా సింపుల్ గా కనిపించేవారు. 

ఇక సంక్రాంతి వంటి పండగల సమయంలో సాంప్రదాయ వేషధారణలో కనిపించేవారు జగన్. తన తండ్రిలా దోతీ కట్టుకునేవారు. భార్య భారతితో కలిసి పండగల సమయంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొనేవారు జగన్. విదేశీ పర్యటనల సమయంలో సూట్ లో కనిపించేవారు. అంతేకానీ అధికారంలో వుండగా ఎప్పుడూ ఇలా కుర్తాలో కనిపించింది లేదు. ఒక్కసారిగా ఈ లుక్ చూసి ప్రజలు అవాక్కయితే... ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియాలో మాత్రం జగన్ స్టైలు మారింది... అంటూ మీమ్స్ వస్తున్నాయి.


  
 

click me!