Latest Videos

పిన్నెళ్లి మంచివాడు.. 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. ఈవీఎం పగలగొట్టడాన్ని సమర్థించిన జగన్

By Galam Venkata RaoFirst Published Jul 4, 2024, 3:23 PM IST
Highlights

‘‘పిన్నెళ్లి మంచివాడు.. కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. అన్యాయం జరిగింది కాబట్టే ఈవీఎం పగలగొట్టాడు’’ అని మాజీ సీఎం జగన్ అన్నారు

2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా సాగింది. పోలింగ్‌ రోజున, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల గొడవలు, ఘర్షణలు జరిగాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు చేసిన వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారు. 

అయితే, ఎన్నికల పోలింగ్‌ రోజు (మే 13న) మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ ఏజెంట్లు అడ్డుకోబోయినా లెక్కచేయకుండా ఈవీఎంను పగలగొట్టి దర్జాగా బయటకు వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలింగ్ సిబ్బందిగానీ, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులుగానీ ఫిర్యాదు చేయకపోవడంతో కొద్దిరోజుల తర్వాత సీసీ ఫుటైజీ వైరల్ అయ్యాక.. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో చర్యలు చేపట్టారు. కాగా, ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి రిమాండు ఖైదీగా నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయన్ను పలువురు వైసీపీ నేతలు ఇటీవల వరుసగా పరామర్శించారు. 

గురువారం తాడేపల్లి నుంచి నెల్లూరు వచ్చిన వైసీపీ అధినేత జగన్‌... నేరుగా సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. వైసీపీ నాయకులతో కలిసి పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌... పిన్నెళ్లి చేసిన పనిని సమర్థించారు. ఈవీఎం పగలగొట్టడం కరెక్టేనన్నట్లు మాట్లాడారు. పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని కావాలనే కేసులో ఇరికించారని ఆరోపించారు. 

అసలు జగన్‌ ఏమన్నారంటే...

‘‘కారంపూడి ఘటన మే 14న జరిగింది. కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు మహిళలు ఇబ్బందిపడినప్పుడు వారిని పరామర్శించేందుకు పిన్నెళ్లి బయలుదేరారు. అయితే, కారంపూడిలో ఎంటర్‌ కాక ముందే పిన్నెళ్లిని పోలీసులు అడ్డగించారు. అక్కడ నారాయణ స్వామి అనే సీఐ.. ఎమ్మెల్యేకి తటస్థపడలేదు. ఆ గొడవ జరిగినప్పుడు ఎవరో వేసిన చిన్నారాయి సీఐకి తగిలింది. అది తగిలిందో లేదో కూడా తెలియదు. ఈ ఘటన జరిగిన 9 రోజులకు మే 23న ఆయనకేదో జరిగినట్లు సీఐ హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది అన్యాయం కాదా.? ఈ ఘటన నిజంగానే జరిగి ఉంటే మెడికో లీగల్‌ కేసులు ఎందుకు పెట్టలేదు. పల్నాడులో జరిగిన ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వేసిన సిట్‌ ఇచ్చిన రిపోర్ట్‌లో ఈ కేసు గురించి ఎందుకు లేదు? ఒక మనిషిని అన్యాయంగా హత్యాయత్నం కేసులో ఇరికించడం న్యాయమేనా..?’’ అని జగన్ ప్రశ్నించారు. 

‘‘ ఇక మరోకేసు.. మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు అనే పోలింగ్‌ కేంద్రం వద్ద జరిగిన ఘటన మీద...ఈ ఘటన ఎందుకు జరిగిందని కనీసం ఆలోచించాలి కదా. అక్కడున్న ఎస్సీలను ఓటేయయకుండా వేరే సామాజికవర్గం వారు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆ పరిస్థితిని గమనించి.. ఎస్పీకి ఫోన్‌ చేసినా రాని పరిస్థితి. కనీసం సీఐ, ఎస్సైని పంపించని పరిస్థితిలో.. ఒకేఒక హోం గార్డును పెట్టి సెన్సిటివ్‌ బూత్‌ నడుపుతున్నారు. అలాంటి సమయంలో అన్యాయం జరుగుతుందని చెప్పడం కోసం ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగింది. నిజంగా ఎమ్మెల్యేనే రిగ్గింగ్‌ చేసుకుంటా ఉంటే.. అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి బాగుంటే ఈవీఎం ఎందుకు పగలగొడతాడు. అన్యాయం చూశాడు కాబట్టే ఈవీఎం పగలగొట్టాడు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, ఈవీఎం పగలగొట్టిన కేసులో పిన్నెళ్లికి బెయిల్ వచ్చిందని... పిన్నెళ్లి అన్యాయం చేయలేదని కోర్టు కూడా గుర్తించింది కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్పారు. పిన్నెళ్లిని తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. పిన్నెళ్లి మంచివాడు.. కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. అన్యాయం జరిగింది కాబట్టే ఈవీఎం పగలగొట్టాడని మాజీ సీఎం జగన్ పునరుద్ఘాటించారు.

click me!