వివేకా హత్య కేసు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు..

By Sumanth KanukulaFirst Published May 27, 2023, 2:24 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ  హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్‌: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ  హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదితో పాటు వివేకా కూతురు సునీతా రెడ్డి తరఫు న్యాయవాది, సీబీఐ న్యాయవాది కూడా సుదీర్ఘ వాదనలు వినిపించించారు. ఈ వాదనలు విన్న అనంతరం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 31కు వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇక, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా శుక్రవారం ఆయన తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు ఐదు గంటలకు పైగా తన వాదనలను వినిపించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో అనేక చట్టపరమైన లోపాలను ఉన్నాయని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్న దస్తగిరి మూడు వాంగ్మూలాలను ట్రయల్ కోర్టులో సీబీఐ సమర్పించినా ఆయనను అరెస్టు చేయకపోవడం విచిత్రంగా ఉందన్నారు. నిందితుడికి కోర్టు క్షమాపణ ఇస్తే తప్ప..దర్యాప్తు అధికారులు అతన్ని సాక్షిగా చెప్పలేరని అన్నారు. 

ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి తుది ఫలితం సాధించకుండా.. సీబీఐ అధికారులు తుది నివేదిక (ఛార్జ్ షీట్) దాఖలు చేశారు. మళ్లీ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు అధికారులు సేకరించిన ఆధారాలు లేదా పత్రాల్లో కడప ఎంపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. మరోవైపు సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ గంటకుపైగా వాదనలు వినిపించారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో సీబీఐ వాదనలను శనివారం వింటామని హైకోర్టు పేర్కొంది. 

దీంతో ఈరోజు సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపిస్తూ.. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని  తెలిపారు. కేసు దర్యాప్తులో తొలి నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. దర్యాప్తు సీబీఐ పద్దతి ప్రకారం చేస్తారు కానీ.. అవినాష్ కోరుకున్నట్టు కాదని అన్నారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ది పొందాలని అవినాష్ చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరుకాకుండా సాకులు చూపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సీబీఐ లాయర్ బదులిస్తూ.. రాజకీయ ఉద్దేశాలే వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణమని చెప్పారు. హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని పేర్కొన్నారు.

click me!