అవినాష్ విచారణకు సహకరించడం లేదు.. వివేకా హత్యకు రాజకీయ కారణం: హైకోర్టులో సీబీఐ వాదన

By Sumanth Kanukula  |  First Published May 27, 2023, 11:07 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ  వైఎస్ అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. 


హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ  వైఎస్ అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అవినాష్ రెడ్డి  ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఆయన తరఫు న్యాయవాదులతో పాటు, వివేకా కూతురు సునీతారెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఈ సందర్భంగా సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. 

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తెలిపారు. కేసు దర్యాప్తులో తొలి నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. దర్యాప్తు సీబీఐ పద్దతి ప్రకారం చేస్తారు కానీ.. అవినాష్ కోరుకున్నట్టు కాదని అన్నారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ది పొందాలని అవినాష్ చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరుకాకుండా సాకులు చూపిస్తున్నారని తెలిపారు. 

Latest Videos

Also Read: వివేకా కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌, రేపు సీబీఐ వాదనలు వింటామన్న హైకోర్ట్

ఈ సందర్భంగా వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సీబీఐ లాయర్ బదులిస్తూ.. రాజకీయ ఉద్దేశాలే వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణమని చెప్పారు. హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ఇక, సీబీఐ వాదనలు వినిపిస్తున్న సమయంలో.. సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ, వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి  కోర్టులోనే ఉన్నారు. 
 

click me!