YS Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు: సునీత తరఫు న్యాయవాది

By Sumanth KanukulaFirst Published Jun 28, 2022, 12:00 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు బెయిల్‌ మంజూరు చేయవద్దని వివేకా కుమార్తె ఎన్‌ సునీత తరఫు న్యాయవాది పి వెంకటేశ్వర్లు సోమవారం హైకోర్టును కోరారు. 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు బెయిల్‌ మంజూరు చేయవద్దని వివేకా కుమార్తె ఎన్‌ సునీత తరఫు న్యాయవాది పి వెంకటేశ్వర్లు సోమవారం హైకోర్టును కోరారు. వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక నుంచి హత్య తర్వాత ఆధారాలు ధ్వంసం చేసే వరకు శివశంకర్‌ రెడ్డి కీలకపాత్ర పోషించారని కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో ఉన్న శివశంకర్ సాక్షులను బెదిరిస్తున్నాడని, కేసు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఈ కేసులో సీబీఐ విచారణను అడ్డుకునేందుకు శివశంకర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు.

‘‘విచారణను వేగవంతం చేయాలంటూ వివేకా కుమార్తె సునీత అప్పటి డీజీపీని కలిసిన సందర్భంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తనకు రెండు కళ్లు లాంటి వారని సీఎం జగన్ చెప్పినట్లుగా ఆయన సునీతకు చెప్పారు. ఆ విషయాన్ని సునీత 164 స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయపార్టీలో దేవిరెడ్డి ఇప్పటికీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు ముగించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో దేవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే అధికారులను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దిగువ కోర్టులో విచారణ ముగిసేవరకు శివశంకర్ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయవద్దు’’ అని న్యాయవాది పి వెంకటేశ్వర్లు కోర్టును అభ్యర్థించారు. 


మరోవైపు ఈ హత్య కేసులో పిటిషనర్ ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది టి నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మరో నిందితుడు షేక్ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా అతన్ని అరెస్టు చేశారని కోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి గత ఆరున్నర నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారని చెప్పారు. ట్రయల్ కోర్టు సీబీఐ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్నందున పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. 

ఇక, సోమవారం జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది వాదనలతో పాటు దేవిరెడ్డి తరఫున రిప్లై వాదనలు ముగియడంతో బెయిల్‌ కోసం ఇతర నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో వాదనలు వినేందుకు హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 
 

click me!