పవన్ కల్యాణ్ కోసం మేమంతా బట్టలు చించుకుంటే... ఆయన మాత్రం చంద్రబాబుకు జై..: మంత్రి అంబటి

By Arun Kumar PFirst Published Jun 28, 2022, 11:13 AM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

విజయవాడ : పవన్ కల్యాణ్ మా వోడు మా వోడు అని కాపులమైన మేమంతా బట్టలు చించుకుంటన్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు కోసం పని చేస్తూ కాపులను మోసం చేస్తున్నాడని... ఆయనను కులపిచ్చితో ఎవరూ నమ్మొద్దని మంత్రి సూచించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న పవన్ ఎప్పటికీ సిఎం కాలేడని అంబటి అన్నారు. 

విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన వైసిపి ప్లీనరీ సన్నాహక సమావేశంలో మంత్రి అంబటి,హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐవి ప్యాలెస్ లో జరిగిన ఈ ప్లీనరీ సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  
 
పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అని... అందుకే ఏ పార్టీతోనూ రెండేళ్ల కన్నా ఎక్కువకాలం పొత్తు పెట్టుకోడని అంబటి అన్నారు.  చంద్రబాబుకు జై కొట్టేవాళ్లు సొంతపుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ మాత్రమే... మిగతా ఎవ్వరూ ఆయన జై కొట్టరని మంత్రి అంబటి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవతంగా సాగుతోందన్నారు. కేవలం వైసిపికి మాత్రమే కాదు టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలకు ఓటేసిన ప్రతి ఇంటికి వెల్తున్నామని... సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వ పథకాలను ఇతర పార్టీలకు ఓటేసిన వారుకూడా అభినందిస్తున్నారని... పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు. 

వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందడంలేదని ఒక్కరైనా చెప్పగలరా? లక్షా పది వేల కోట్లను ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకు నేరుగా ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. ఇలాంటి ముఖ్యమంత్రిని కాదని మళ్లీ చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్దంగా లేరని అంబటి అన్నారు. 

ప్రతిపక్ష టిడిపి రివర్స్ మహానాడు నడపబోతుందని మంత్రి ఎద్దేవా చేసారు. ఒంగోలులో మహానాడు అని ఇప్పుడు మినీ మహానాడు అంటున్నారని... త్వరలోనే అంతమయ్యే మహానాడు పెడతాడంటూ చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కలవాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని... జగన్ ను సింగిల్ గా ఎదుర్కోలేకే కలిసిరండు అంటున్నాడని అన్నారు. రెండు సంవత్సరాలు కాదు... మరో రెండు జన్మలెత్తినా చంద్రబాబు సిఎం కాలేడని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని అంబటి పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం వుంది... అయినా ముందుగానే అంటే వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్లీనరీ ద్వారా యుద్ధబేరి మోగబోతుందని పేర్కొన్నారు. తమకు ఎవరు ఎదురొచ్చినా  కట్టకట్టి కృష్ణానదిలో కలిపేస్తామని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. 
 
ఇక హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అందుకు వైసిపి కార్యకర్తలే కారణమన్నారు. జగనన్నే మన ధైర్యం... మనందరికీ ఆయనే అండగా ఉన్నారన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ప్రతిపక్షాలు పెట్టిన కేసులన్నింటినీ తట్టుకుని కేవలం ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా సిఎం జగన్ ముందుకెళుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైసిపి నాయకులు, కార్యకర్తలకు హోమంత్రి వనిత సూచించారు. 

click me!