గుండెపోటుతో మరణించాడని ఎలా చెప్పారు: వైఎస్ వివేకా హత్యపై సిబిఐ

By telugu teamFirst Published Aug 11, 2021, 8:39 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏలను విచారించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించాడని తొలుత ఎందుకు సమాచారం ఇచ్చారని అడిగారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని ఎలా చెప్పారని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు(పిఏలు) రాఘవ రెడ్డి, రమణా రెడ్డి, అప్పటి సాక్షి దినపత్రిక జిల్లా ప్రతినిధి బాలకృష్ణా రెడ్డిలను ప్రస్నించారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని పోలీసులకు మొదట ఎందుకు సమాచారం ఇచ్చారని సిబిఐ అధికారులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం. అవినాష్ రెడ్డి పీఎలను ఇద్దరిని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 

వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి వాడిన మారణాయుధాల కోసం చేపట్టిన గాలింపు చర్యలను సిబిఐ అధికారులు మంగళవారం నిలిపేశారు. కడప జిల్లా పులివెందులలో గల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సిబిఐ అధికారులు మంగళవారం 12 మందిని విచారించారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్యను, హోంగార్డు నాగభూషణంరెడ్డిని కూడా విచారించారు. శంకరయ్య హత్య జరిగిన చోట ఉన్నప్పుడే రక్తం మరకలను, ఇతర సాక్ష్యాధారాలను తుడిచేశారనే ఆరోపణలపై ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి సమర్పించిన అనుమనితుల జాబితాలో శంకరయ్య పేరు కూడా ఉంది. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనాయతుల్లా, వివేకా పిఏ జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి, చక్రాయపేట మండలానికి చెందిన వైసీపీ నాయకులు ఆదిరెడ్డి, అంజిరెడ్డిలను సిబిఐ అధికారులు విచారించారు. 

అంతే కాకుండా వేంపల్లే మండలానికి చెందిన చెన్నకేశవ, మల్లి, రహ్మతుల్లాఖాన్ లను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వాచ్ మన్ రంగయ్య జిల్లా మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సిబిఐ అధికారులు వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ యాదన్ ను అరెస్టు చేశారు. 

click me!