రూటు మార్చిన జగన్..‘లోకల్’ పైనే దృష్టి

First Published Jan 24, 2018, 11:23 AM IST
Highlights
  • పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు.

పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. మొన్నటి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రూటు మార్చిన విషయం స్పష్టంగా కనబడింది. ఇంతకీ రూటు మార్చటం అంటే ఏంటనుకుంటున్నారా? పాదయాత్ర రూటు కాదులేండి. తన ప్రసంగాల్లో వాడి వేడిని పెంచటానికి వీలుగా మాట్లాడదలుచుకున్న అంశాల విషయంలోనే రూటు మార్చారు. ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వీలున్నంతలో స్ధానిక అంశాలపైనే బాగా దృష్టి పెట్టాలన్నది జగన్ ఆలోచన.

ఈ విషయం చిత్తూరు జిల్లాలో బాగా వర్కవుటయ్యింది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 600 హామీలను గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల వారీగా తమ ప్రభుత్వం ఏమి చేయబోతోంది అన్న విషయాన్ని అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే, అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రసంగానికి తర్వాత జరుగుతున్న విషయాలకు పొంతన కనబడటం లేదు. ఏ జిల్లాలో పరిశ్రమ, విద్యాసంస్ధ, ఆసుపత్రి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ అయినా సరే, వీలున్నంతలో రాజధాని జిల్లాలకే తీసుకెళుతున్నారు.

ఈ విషయంలో టిడిపి నేతల్లోనే అసహనం కబనడుతోంది. దానికితోడు ప్రతీ జిల్లాలోనూ స్ధానికంగా ఎన్నో సమస్యలున్నాయి. అయితే, ఏ సమస్య పరిష్కారంలో కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అటువంటి విషయాలనే జగన్ ప్రస్తావించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 23 రోజులు పర్యటించారు.

తన పర్యటనలో ప్రధానంగా జగన్ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలనే ప్రస్తావించారు. మూసేసిన షుగర్ ఫ్యాక్టరీలు కావచ్చు, రైతుల సమస్యలు, టెక్స్ టైల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు, మూతపడిన గ్రానైట్ పరిశ్రమలను తెరిపించటం ఇలా చాలా సమస్యలనే ప్రస్తావించారు. దానికి స్ధానికుల నుండి కూడా పెద్ద ఎత్తు స్పందన కనబడింది.

అదే పద్దతిలో నెల్లూరు జిల్లాలో కూడా లోకల్ అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని జగన్ అనుకున్నారు. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసిపి 7 చోట్ల గెలిచింది. అయితే, గూడూరు ఎంఎల్ఏ పాశం సునీల్ టిడిపిలోకి ఫిరాయించారు. కాబట్టి పోయిన సారి వచ్చిన సీట్లను నిలబెట్టుకోవాలంటే జనాల్లోకి మరింత చొచ్చుకుపోవాలంటే స్ధానిక సమస్యలను ప్రస్తావించటంపైనే జగన్ ప్రధాన దృష్టి పెట్టారు.

click me!