దేశం ‘కంచుకోటల’ను కూల్చేందుకు జగన్ కొత్త వ్యూహం

First Published Dec 12, 2017, 7:37 AM IST
Highlights
  • బీసీలు ఎక్కువున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబునాయుడు, ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్ కు  అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి వస్తుందా రాదా అన్నది వేరే సంగతి.

అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మరిన్ని పథకాలు అమలు చేయటం, వ్యూహాలకు పదునుపెట్టటం సహజమే. అదే సమయంలో వైసిపి అధినేత జగన్ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అందులో భాగమే ప్రజాసంకల్పయాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్ర. సరే, ఇక విషయానికి వస్తే వైసిపి వైపు బీసీ సామాజికవర్గాలను ఆకర్షించే విషయమై ప్రధానంగా దృష్టి పెట్టారు. టిడిపి ఏర్పాటైన దగ్గర నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజికవర్గాల్లో బీసీలే ప్రధానం.

అధికారంలో ఉన్నా లేకపోయినా బీసీల్లో మెజారిటీ వర్గాలు మాత్రం టిడిపితోనే ఉన్నాయి. ఇపుడు జగన్ సరిగ్గా ఆ వర్గాలను ఆకట్టుకునేందుకే ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదికూడా పాదయాత్ర చేస్తూనే బీసీలను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే టిక్కెట్లను ప్రకటించేస్తున్నారు.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బీసీ సామాజికవర్గాల బలం బాగా ఎక్కువ. అనంతపురం జిల్లాలో పాదయాత్ర జరుగుతుండగా కర్నూలు జిల్లాలో పూర్తయ్యింది. అందుకే కర్నూలు జిల్లాలో పాదయాత్ర  చేస్తూనే కర్నూలు, అనంతపురం జిల్లాలో ఒక ఎంపి సీటు బీసీలకు కేటాయిస్తానని హామీ ఇచ్చేశారు. అదే విధంగా పై రెండు జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లలో కూడా మెజారిటీ సీట్లలో బీసీలనే నిలబెడతానంటూ బహిరంగంగా  హామీ ఇచ్చారు.

జగన్ హామీలకు అనుగుణంగానే వైసిపిలోని బిసి సెల్ నేతలు మొత్తం 175 సీట్లలోను బిసిల జనాభాపై సర్వే మొదలుపెట్టారు. సర్వే నివేదిక రాగానే జగన్ హామీలకు మరింత ఊపు తేవాలని జగన్ నిర్ణయించారట. మొత్తానికి సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు తెరవెనుక జగన్ భారీ వ్యూహాన్నే రచిస్తున్నారు. పాదయాత్ర పూర్తి కాగానే బిసి డిక్లరేషన్ ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. అప్పుడు బీసీలకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యూహం గనుక వర్కవుటైతే టిడిపికి ఇబ్బందులు తప్పవేమో ?

 

click me!