చంద్రబాబు జిల్లాలో జగన్ పాదయాత్ర..ఎలా సాగుతుందో ?

First Published 27, Dec 2017, 8:02 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశిస్తున్నారు.

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. బుధవారం రాత్రి కూడా జగన్ కదిరి నియోజకవర్గంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం కదిరి నియోజకవర్గం మీదుగా చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. రేపటితో రాయలసీమలోని మూడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసినట్లవుతుంది. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర కడప, కర్నూలు పూర్తయి అనంతపురం జిల్లాల్లో పూర్తిచేసుకోబోతోంది.

చిత్తూరు జిల్లాలో సుమారు 22 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గంలో సాగే పాదయాత్రలో జగన్ దాదాపు 250 కిలోమీటర్లు నడుస్తారు. కడప సొంత జిల్లా కాబట్టి జనాల స్పందన బాగానే ఉందనుకున్నారు. అయితే, అంతకన్నా ఎక్కువగా కర్నూలు జిల్లోలోను తర్వాత అనంతపురంలో కూడా స్పందన అనూహ్యంగానే ఉంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా కావటంతో వైసిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని గట్టిగా కృషి చేస్తున్నారు.

పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజవకవర్గాల్లో వైసిపి 8 నియోజకవర్గాలు గెలుచుకున్నది. చంద్రబాబు సొంత జిల్లానే అయినా మెజారిటీ సాధించలేకపోయారు. అయితే, ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా పలమనేరు ఎంఎల్ఏ అమరనాధరెడ్డిని టిడిపిలోకి లాక్కున్నారు. దాంతో ఇరుపార్టీల బలాబలాలు ఒకటయ్యాయి. జిల్లాలోని రెండు పార్లమెంటు స్ధానాల్లో చిత్తూరులో టిడిపి గెలవగా, తిరుపతిలో వైసిపి గెలిచింది.

సరే, ఈ విషయాలను అలావుంచితే, రాయలసీమలోని మిగిలిన మూడు జిల్లాల కన్నా చిత్తూరులో పాదయాత్రను మరింత గ్రాండ్ సక్సెస్ చేయాలన్నది పెద్దిరెడ్డి పట్టుదల. ఎందుకంటే, ఇది చంద్రబాబు జిల్లా కావటమే ప్రధాన కారణం. అందుకనే వైసిపి నేతలందరూ జగన్ పాదయాత్రను అత్యంత ప్రతిష్టగా తీసుకున్నారు. జిల్లాలోని తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, నగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది. శ్రీకాళహస్తి నుండి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించటం ద్వారా రాయలసీమ జిల్లాల పర్యటన పూర్తవుతుంది.

 

Last Updated 25, Mar 2018, 11:57 PM IST