బాబు నెంబర్ వన్, నారా లోకేష్ పప్పు: వైఎస్ జగన్

First Published May 30, 2018, 6:24 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

నర్సాపురం: తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

మహానాడులో అబద్ధాలు, మోసాలు, దగా, కుట్ర, వెన్నుపోట్లలో అంతర్జాతీయ పోటీలు జరిగాయని, ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ గా నిలిచారని, మంత్రి నారా లోకేష్ రెండో స్థానంలో నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ పప్పు అనే బిరుదును నిలబెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసి, విడాకులు తీసుకున్న తర్వాత చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందని అన్నారు. మహానాడులో అంతా తిట్ల తీర్మానాలు, అబద్ధాల ప్రోగ్రెస్ రిపోర్టులు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు 600లకు పైగా హామీలు ఇచ్చి 98 శాతం అమలు చేశానని అబద్దాలు చెప్పుకుంటున్నారని అన్నారు. 

ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని 2017 మహానాడులో తీర్మానం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇదిగో.. అదిగో వశిష్ట వారధి అంటూ చంద్రబాబు సినిమా చూపిస్తున్నారని, ఎన్నికలు రాగానే ఆయనకు వశిష్ట వారథి గుర్తుకు వస్తుందని జగన్ అన్నారు. 

రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, నాలుగేళ్లలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నారు. మత్స్యకారాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు. పింఛన్లు పెంచబోతున్నామంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. ఎలాగూ అధికారంలోకి రాబోమని తెలిసి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. రైతు రుణాలు మాఫీ చేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 

click me!