Latest Videos

కుప్పంలో చంద్రబాబుకు ఎసరు: పక్కా ప్లాన్ తో వైఎస్ జగన్

By Pratap Reddy KasulaFirst Published Aug 4, 2022, 9:21 AM IST
Highlights

ఏపిలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడానికి సిఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు కంచుకోట కుప్పంతో తన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు.

అమరావతి: తమ పార్టీ కార్యకర్తలను వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని శాసనసభా నియోజక వర్గాల పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. రాష్ట్రంలోని 175 స్థానాలు గెలుచుకోవాలనే నినాదంతో ఆయన ముందకు సాగుతున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఆయన పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయయన గత నెల 18వ తేదీన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఓ వర్క్ షాపు నిర్వహించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి అధికారంలోకి రావాలని, అది కూడా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన వారికి సూచించారు. తాను కూడా స్వయంగా రంగంలోకి దిగి 175 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతారు. 

తన సమావేశాల పరంపరను తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంతో ప్రారంభించనున్నారు. గురువారంనాడు, అంటే ఈ రోజు కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకు చాలా కాలంగా తన వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. జగన్ సూచన మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును బలహీనపరచడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటూ వస్తున్నారు. .

చంద్రబాబుకు కుప్పం పెట్టని కోట. 1989 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇక్కడి నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో చాలా వరకు వైసిపి పాగా వేసింది. ఆ ఊపుతోనే వచ్చే శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుకు చుక్కలు చూపించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. తన ఎత్తుగడల ద్వారా చంద్రబాబును కుప్పం నియోజకవర్గానికి పరిమితం చేయాలని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి చంద్రబాబుకు తగిన వెసులుబాటు ఇవ్వకూడదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. 

click me!