‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి వారి గుండెల్లో చోటు దక్కించుకోవాలి. మంచి చేసి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. ఇలా దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేసి, కేసులు పెట్టి భయాందోళనలతో రాజకీయాలు చేస్తే అది నిలబడదు.’’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అక్రమ కేసులు, దాడులకు బలైనవారికి రక్షణ కల్పించేందుకు, బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు.
గురువారం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో రిమాండు ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి... పిన్నెళ్లిపై తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిందని మండిపడ్డారు.
‘‘పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి మీద ఏకంగా 307.. హత్యాయత్నం లాంటి కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి, చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొట్టి.. వీళ్లే కేసులు పెడుతున్నారు. ఇంతటి దారుణంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇదే మాదిరిగా.. వైసీపీ పాలనలో జగనేం చేశాడు? కులం చూడలేదు. మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ పథకాలు డోర్ డెలివరీ చేశాం. ఈరోజు కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను విరగ్గొడతున్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయి. ’’ అని జగన్ హెచ్చరించారు.
‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి వారి గుండెల్లో చోటు దక్కించుకోవాలి. మంచి చేసి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. ఇలా దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేసి, కేసులు పెట్టి భయాందోళనలతో రాజకీయాలు చేస్తే అది నిలబడదు. తాత్కాలిక మేలు జరుగుతుందే తప్ప.. వేరే కాదు. ఇలాగే కొనసాగితే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడులో మార్పు రావాలని కోరుకుంటున్నా. ప్రజలు ఎందుకు ఓటేశారో చంద్రబాబు ఆలోచించాలి.’’
‘‘ప్రజా వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి ఓడిపోయింది. చంద్రబాబు చేసిన మోసపూరిత హామీల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు హామీలను నమ్మి ప్రజలు వారికి ఓటేశారు.’’
‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా హామీలకు అతీగతీ లేదు. రైతులకు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇంకా ఇవ్వలేదు. బడులు మొదలయ్యాయి. బడి ఈడు పిల్లలకు ప్రతి ఒక్కరికీ ఇస్తానన్న రూ.15వేలు ఏమయ్యాయని ప్రతి తల్లి అడుగుతోంది. పాలనపై ధ్యాసపెట్టి.. హామీలు అమలు చేయాలి. 18 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు చంద్రబాబు ప్రతినెలా ఇస్తానన్న రూ.1500 కోసం ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి భయాందోళన సృష్టించే దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు’’ జగన్ విమర్శించారు.
‘‘ఏపీలో దారుణమైన పరిపాలన సాగుతోందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు వారివారి స్థాయిల్లో రెడ్‌బుక్‌లు పెట్టుకుని మెయింటెయిన్ చేస్తున్నారు. గ్రామస్థాయిల్లోనూ ఎక్కడికక్కడ రెడ్ బుక్‌లు పెట్టుకొని విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యేలే జేసీబీలు తీసుకెళ్లి నిర్మాణాలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి దాడుల సంస్కృతిని చంద్రబాబు ఆపాలి. లేదంటే తమ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలకు ఇదే గతి పడుతుంది’’ అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.