మహిళా సాధికారతే లక్ష్యం.. : వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధులను జమ చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Mar 25, 2023, 1:57 PM IST
Highlights

రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామిని నిలబెట్టుకున్నట్టుగా తెలిపారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామిని నిలబెట్టుకున్నట్టుగా తెలిపారు.డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చానని గుర్తుచేశారు. పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచామని  చెప్పారు. సీఎం జగన్‌ ఈరోజు ఏలూరు  జిల్లా దెందులూరులో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయం  విడుదల  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా కింద 78.94 లక్షల మంది లబ్దిదారులకు రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా చెప్పారు. 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నట్టుగా తెలిపారు. ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటికే రెండు విడుతల్లో రూ. 12,758.28 కోట్లు అందించామని తెలిపారు. నేడు అందిస్తున్న మొత్తంతో కలిపి ఇప్పటివరకు రూ. 19,178 కోట్లు అందించామని వెల్లడించారు. పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు చేస్తున్నట్టుగా చెప్పారు. స్వయం ఉపాధి చేపట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వ్యాపార దిగ్గజాలతో ఒప్పందం చేసుకుని వ్యాపార  మార్గాలను చూపామని.. ఆసరా, చేయూత, సున్నావడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు హయాంలో సగటున బ్యాంకు రుణాలు  రూ. 14 వేలు కోట్లని.. తమ హయాంలో రూ. 30 వేల కోట్ల రుణాలు అందుతున్నాయని చెప్పారు. పొదుపు  సంఘాల మహిళలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని అన్నారు. పొదుపు సంఘాల పనితీరును  ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. 

చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలు సీ,డీ గ్రేడ్‌లకు పడిపోయాయని విమర్శించారు. తమ హయాంలో పొదుపు సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లకు చేరాయని చెప్పారు. సున్నా వడ్డీ పథకం కింద రూ. 3,036 కోట్లు చెల్లించామని తెలిపారు. 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించామని చెప్పారు. 22 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లు కడుతున్నామని తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. మహిళల రక్షణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని చెప్పారు. రాజకీయంగా కూడా మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామ‌ని చెప్పారు.

click me!