చీరాల గొడవపై జగన్ సీరియస్: రంగంలోకి సజ్జల

By narsimha lodeFirst Published Nov 3, 2020, 2:36 PM IST
Highlights

ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.


చీరాల:ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నెల 1వ తేదీన ఈ నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆదేశించారు.

ఈ ఘర్షణ జరిగిన విషయం తెలిసిన తర్వాత రెండు వర్గాలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లో వారితో మాట్లాడారు. ఈ విషయమై ప్రాథమిక నివేదికను ఆయన సీఎంకి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందించినట్టుగా సమాచారం.సీఎం సూచనతో రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై రంగంలోకి దిగాడు.

పందిళ్లపల్లిలో కరణం బలరాం జన్మదిన వేడుకల సందర్భంగా వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ విషయమై పూర్తి వివరాలివ్వాలని పార్టీ జిల్లా ఇంచార్జీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడ పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఈ ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడ ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకొన్నారని సమాచారం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్ లతో సజ్జల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా మాట్లాడారు. నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలపై మాట్లాడారు.

కృష్ణమోహన్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియోను వెంకటేష్ సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. కరణం కుటుంబంతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆమంచి కృష్ణమోహన్ వివరించారని తెలిసింది.

2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడీ వైసీపీలో చేరారు. 

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా కరణం బలరాం వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలతో కరణం బలరాం జగన్ కు మద్దతు ప్రకటించారు.కరణం వెంకటేష్ వైసీపీలో చేరాడు. 

కరణం వెంకటేష్ వైసీపీలో చేరిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్, కరణం వర్గాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 

click me!