ప్రత్యేక హోదా బాబుకు ఇష్టంలేదు,అందుకే...:జగన్

First Published Jul 7, 2018, 5:39 PM IST
Highlights

ప్రత్యేక హోదా ఇష్టం లేకనే తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబునాయుడు రాజీనామాలు చేయించలేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో శనివారం నాడు జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

మచంద్రాపురం:ప్రత్యేక హోదా వస్తోందనే ఉద్దేశ్యంతోనే  తమ పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబునాయుడు రాజీనామా చేయించలేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను నాలుగేళ్లుగా తుంగలో తొక్కి.. ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదాపై బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీరు కనీసం తాగడానికి కూడ ఉపయోగపడడం లేదని జగన్ చెప్పారు. బురద నీటిని తాము తాగుతున్నామని ఆయన చెప్పారు. తాము ఏ రకమైన నీటిని తాగుతున్నామో చూపాలని స్థానికులు తనకు చెప్పారని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబునాయుడు పాలన చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. పేదవాళ్ళకు కేటాయించే ఇళ్లలో కూడ డబ్బులు వసూలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు సీట్లు మినహా అన్ని సీట్లలో టీడీపీ అభ్యర్ధులను గెలిపిస్తే  వారంతా ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.రామచంద్రాపురంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం కూల్చేస్తే  రోడ్డును వేస్తామని చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు  ఇళ్ల నిర్మాణం పేరుతో  మూడు లక్షలను పేదల పేరుతో రుణాలు ఇప్పిస్తున్నాడని చెప్పారు. రూ. 3 లక్షలకే ఇల్లు నిర్మాణం పూర్తి కావస్తోందని ఆయన చెప్పారు. కానీ, ఇంటి యజమాని పేరుతో రూ. 3 లక్షలను అప్పును ఇప్పించడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అప్పును తాను మాఫీ చేస్తామని చెప్పారు.

నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు దగా చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎన్నికలకు ఆరు మాసాల ముందు మన రాష్ట్రాన్ని మోడీ మోసం  చేశారని విమర్శలు గుప్పించారు. ఇంత కాలం పాటు కేంద్రమంత్రులుగా ఉండి రాష్ట్రానికి టీడీపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయం ఎన్నికలకు ఆరు మాసాల ముందు గుర్తుకు వచ్చి ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టుగా డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీకి న్యాయం జరగాలంటే మరో ఐదేళ్లు తనకు అవకాశం ఇవ్వాలని కోరడం మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన  హమీలను అమలు చేయకుండా చంద్రబాబునాయుడు మోసం చేశారని ఆయన ఆరోపించారు.బెల్ట్ షాపులు రద్దు చేస్తామని బాబు ఇచ్చిన హమీని అమలు చేయలేదని ఆయన చెప్పారు. కేజీ నుండి పీజీ వరకు  ఉచిత విద్యను ఇస్తామని ఇచ్చిన హమీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబునాయుడు అవినీతిని పెంచిపోషిస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తోందని తెలిసి కూడ తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని ఆయన ఆరోపించారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ రాకుండా అడ్డుకొన్నారని బాబుపై జగన్  నిప్పులు చెరిగారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇవ్వలేదని చెప్పారు.

ఆరు మాసాల్లో ఎన్నికలు జరుగుతాయని మనకు తెలుసు.. ఎలాంటి నాయకుడు కావాలో మనం ఆలోచించుకోవాలని జగన్ ప్రజలను కోరారు. మోసం చేసే నాయకుడు, అబద్దాలను చెప్పే నాయకుడు కావాలా వద్దా అనే విషయమై చర్చించుకోవాలని ఆయన సూచించారు.

click me!