కేసీఆర్ తో నేను మాట్లాడతా, వారిని బీసీ జాబితాలో చేర్చాలని కోరుతా: వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Feb 17, 2019, 11:09 PM IST
Highlights

తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ తో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చిస్తానన్నారు. 
 

ఏలూరు: తెలంగాణ రాష్ట్రంలో 32 కులాలను బీసీ జాబితా నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ తొలగించిన అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభలో జోరుగా చర్చ సాగింది. కేసీఆర్ బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల గురించి కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించలేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైఎస్ జగన్. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన వైసీపీ గర్జన సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి వచ్చినప్పుడు 32 బీసీ కులాల తొలగింపు అంశం చంద్రబాబుకు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 

తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ తో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చిస్తానన్నారు. 

మరోవైపు చిరు వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులతోపాటు వడ్డీ లేకుండా రూ.10 వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. బీసీలు రాజకీయంగా ఎదగాలన్నదే తన అభిమతమన్నారు. అందుకే అన్ని నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు వైసీపీ కల్పిస్తుందన్నారు.

నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లకు చట్టం తీసుకొస్తామన్నారు. నామినేషన్‌ పద్దతిన జరిగే కాంట్రాక్టుల్లో 50 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కేలా చట్టం తెస్తామన్నారు. అలాగే వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 

మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని అలాగే బోట్లకు సబ్సిడీపై డీజిల్ ఇస్తామన్నారు. ప్రతి చేనేత మహిళకు పెట్టుబడి రాయితీ కింద ప్రతి నెలా రూ.2 వేలు చెల్లిస్తామన్నారు. 

మేకలు, గొర్రెలు చనిపోతే యాదవులకు రూ.6 వేలు పరిహారం ప్రకటించారు. ప్రధాన ఆలయ బోర్డుల్లో యాదవులు, నాయిబ్రాహ్మణులకు అవకాశం కల్పస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

click me!
Last Updated Feb 17, 2019, 11:09 PM IST
click me!