కాపు కోటా చేయలేను, కానీ అది మాత్రం చేస్తా: జగన్

First Published Jul 28, 2018, 5:49 PM IST
Highlights

తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని, తాను నిజమే చెబుతానని, చేయగలిగింది మాత్రమే చెప్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటితే అమలు చేయలేమని ఆయన చెప్పారు.

జగ్గంపేట: తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని, తాను నిజమే చెబుతానని, చేయగలిగింది మాత్రమే చెప్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటితే అమలు చేయలేమని ఆయన చెప్పారు. అందువల్ల తాను రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని అన్నారు.

కానీ కాపులకు అన్యాయం జరుగుతోందని మొదటిసారి గళమెత్తింది జగనే అని ఆయన అన్నారు. కాపు కార్పోరేషన్ కు చంద్రబాబు కేటాయించిన నిధుల కన్నా రెట్టింపు నిధులు కేటాయిస్తానని ఆయన చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి హామీ ఇవ్వగలుగుతున్నానని ఆయన చెప్పారు. 

చంద్రబాబు రాష్ట్ర పరిధిలో ఉందా, లేదా అని కూడా చూసుకోకుండా హామీ ఇచ్చారని, కాపు రిజర్వేషన్ల హామీ ఇటువంటిదేనని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించి హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. కానీ దేన్నీ అమలు చేయకుండా అన్ని కులాలను కూడా మోసం చేశారని అన్నారు. 

కాపు సోదరులు ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తున్నారని, పక్కనే ముద్రగడ పద్మనాభం కనిపిస్తారని, చేస్తానని చెప్పిందే చేయాలని అడిగితే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన అన్నారు. ముద్రగడను గృహంలో నిర్బంధించారని, ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని ఆయన అన్నారు.

చంద్రబాబు కార్యక్రమాలపై ఎల్లో మీడియా అన్నీ అబద్ధాలు రాస్తోందని ఆయన అన్నారు. రైతు రుణాల మాఫీపై, పొదుపు పథకాలపై అటువంటి ప్రచారమే చేసిందని ఆయన అన్నారు.  

click me!