పోలవరం పునాది దాటి పైకి లేవలేదు, అవినీతి వల్లనే: జగన్

First Published Jul 28, 2018, 5:37 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు పునాది దాటి పైకి లేవలేదని, ప్రాజెక్టును అవినీతిమయం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నత్తనడకన పనులు సాగేలా చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునాది దాటి పైకి లేవలేదని, ప్రాజెక్టును అవినీతిమయం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నత్తనడకన పనులు సాగేలా చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే శ్రీకాకుళం పరిశ్రమలకు తరలించే ఏలేశ్వరం ప్రాజెక్టు నీటిని ఆపేయడానికి వీలయ్యేదని, ఏలేశ్వరం ద్వారా జగ్గంపేట సస్యశ్యామలమై ఉండేదని ఆయన అన్నారు. పుష్కర ఎత్తిపోతలు పూర్తయి ఉంటే జగ్గంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు సాగు నీరు అంది ఉండేదని, వైఎస్సార్ 19 లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఒక్క లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. 

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచక పాలన చూశారని ఆయన అన్నారు. తనకు గత ఎన్నికల్లో అండగా నిలిచిన నియోజకవర్గం ఇదని ఆయన అన్నారు. అందువల్ల ఈ నియోజకవర్గాన్ని తాను మరిచిపోలేనని అన్నారు. తమ పార్టీ కూడా ఇక్కడే పుట్టిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తూ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన నియోజకవర్గం కూడా అని అన్నారు. 

ప్రజలకు చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు. రైతులను చంద్రబాబు పట్టించుకోవడం లేదని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని, చంద్రబాబు అవినీతి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు ఎమ్మెల్యేలు చెప్పారని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రే దళారులకు నాయకుడయ్యాడని ఆయన అన్నారు. హెరిటేజ్ ఫ్రెష్ షాపులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్యాక్ చేసి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా అమ్ముకుంటున్నారని, చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్ పరిస్థితి ఇదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రే అలా చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా అని అడిగారు. 

రూ. 9 కోట్లు చెరువుల నుంచి మట్టిని తవ్వినందుకు ప్రభుత్వం నుంచి తీసుకున్నారని,  అదే మట్టిని అమ్ముకుంటున్నారని, ఒక్కో చెరువును తాటి చెట్టు లోతుకు తవ్వుతున్నారని, మట్టి నుంచీ ఇసుక నుంచీ డబ్బు సంపాదించుకునే స్థాయికి దిగజారారని ఆయన అన్నారు. ఇటువంటి మనుషులను ఏమనాలని ఆయన అడిగారు. 

click me!