
స్వర్ణాంధ్రగా మారాల్సిన నవ్యాంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో కరవాంద్రప్రదేశ్‌గా మార్చిందని ఏపీ ప్రతిపక్షనేత , వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చిన ఎన్డీయే కూటమి కూడా కేంద్రంలోకి వచ్చాక రాష్ట్రానికి మొండి చేయ్యే ఇచ్చిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైఎస్సార్ సిపి ఆదివారం నిర్వహించిన
‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. జై ఆంధ్ర ఉద్యమం విశాఖపట్నం నుంచే మొదలైందని ఇక జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమం కూడా ఇక్కడి నుంచే మొదలవ్వాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పరిపాలనలో ఆంధ్రులెవరూ సంతోషంగా లేరని, ఈ రెండున్నరేళ్లలో బాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందనివిమర్శించారు.
ఎన్నికల వేళ రైతు రుణాల మాఫీని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే రైతుల భూములను రాజధాని నిర్మాణం పేరుతో కొల్లగొడుతుందని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల వూబిలో కూరుకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేకపోతోందన్నారు.
ఎన్నికల హామీల అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ప్రత్యేక హోదారాదని స్వయంగా పుస్తకాలు ముద్రించి మరీ ప్రజాప్రతినిధులకు సరఫరా చేస్తున్నారన్నారు.
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ఎన్నికల వేల టీడడీపీ నేతలు ఊదరగొట్టారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు. జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికీ రెండువేల భృతి ఇస్తానన్నారు.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. బెల్టు షాపులు తీసేస్తామన్న బాబు ఊరూరా బెల్టు షాపులు తెరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. పోరాటాల గడ్డ విశాఖపట్నంపై బికినీల పార్టీలు ఏర్పాటు చేసి రాష్ట్ర గౌరవాన్ని బజారు పాలన చేయోద్దని కోరారు.