
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్ రెడ్డి అని జగన్ తెలిపారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో తన నివాసంలో సమాశయ్యారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డితో చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయముందని.. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతితో ఈరోజు తన అధికార కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న జగన్.. హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
వెంటనే తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. అయితే సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తన భార్య భారతిని తీసుకుని వైఎస్ జగన్ బయలుదేరనున్నారు. మరికాసేపట్లలోనే ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. జగన్‌తో పాటే భారతి కూడా గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. అనంతరం సీఎం జగన్ దంపతులు.. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.