ఓవైపు అమరావతి నిబంధనల సవరణ.. మరోవైపు న్యాయపోరాటం: మూడు రాజధానుల కోసం జగన్ భారీ కౌంటర్ ప్లాన్

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 10:16 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశల్లో కూడా వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనేదే తమ విధానమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశల్లో కూడా వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనేదే తమ విధానమని చెప్పారు. అయితే సీఎం జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చినప్పటీ నుంచి అమరావతి ప్రాంత రైతులు, టీడీపీతో సహా పలు పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం హైకోర్టు ఆదేశాలతో.. మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ కాస్తా నెమ్మదించింది. అయితే తాజాగా మరోసారి మూడు రాజధానుల అంశాన్ని జగన్ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో మూడు రాజధానులనుతిరేకిస్తున్న వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ క్రమంలోనే వారికి కౌంటర్ ప్లాన్‌ను సీఎం జగన్ సిద్దం చేశారు. మూడు రాజధానుల వైపు వేగంగా అడుగులు వేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. న్యాయపరమైన అడ్డంకులను తొలిగించేందుకు ప్రతివ్యుహాన్ని వేగవంతం చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలోని గత టీడీపీ ప్రభుత్వం.. సీఆర్‌డీఏ చట్టంలో పటిష్టమైన నిబంధనలను విధించింది, ఇది ప్రజాభిప్రాయం లేకుండా మార్చడానికి లేదా సవరించడానికి వీలులేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద అడ్డంకిగా మారింది. గత జనవరిలో జగన్ ప్రభుత్వం అమరావతిని 19 గ్రామాలతో మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. అయితే మెజారిటీ ప్రజలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 

తాజాగా సెప్టెంబరు 12 నుంచి 17 వరకు 22 గ్రామాలతో అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు జగన్‌ ప్రభుత్వం మరోసారి ప్రయత్నించగా.. ప్రజాభిప్రాయ సమావేశాల్లో మళ్లీ తిరస్కరణకు చేదు ఫలితం వచ్చింది. అందువల్ల గత చట్టాన్ని సవరించడానికి స్థానిక గ్రామ పంచాయతీలు లేదా గ్రామాలకు ఇన్‌చార్జ్ ఉన్న వ్యక్తి యొక్క సమ్మతి మాత్రమే అవసరం అని పేర్కొనేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం- 2014, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ చట్టం- 2016 సవరణ బిల్లును ఆమోదించింది.  దీంతో రాజధాని నగరంలో పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు అవకాశం కలగనుంది. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్, దాని సంబంధిత అభివృద్ధి ప్రణాళికలను సవరించాలని ప్రతిపాదించింది.

ఇప్పటికే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని పోరాటం చేస్తున్న రైతులు.. తొలివిడతో తిరుపతి వరకు పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు రెండో విడతలో భాగంగా అరసవిల్లికి పాదయాత్ర చేస్తున్నారు. అయితే వారు.. ఏపీ సీఆర్‌డీఏ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం అన్నింటిని ధీటుగా ఎదుర్కొవాలని భావిస్తోంది. 


మరోవైపు  అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడాన్ని సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై  స్టే విధించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే అమరావతి ఏకైక రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. మూడు రాజధానులకు మద్దతుగా బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ముందుకు వెళ్తుంది.  

అమరావతిలో పేదలకు ఇళ్లు..
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని.. అయితే ఏపీసీఆర్డీఏ నిబంధనలను ఉటంకిస్తూ ఏపీ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం శాసనసభ, మండలిలో మెజారిటీ ఓటుతో సీఆర్‌డీఏ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఇది అమరావతిలో కనీసం 50,000 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల అమరావతిలో వైఎస్సార్‌సీపీ బలమైన మద్దతును కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
2024 ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్న సీఎం జగన్.. రానున్న 20 నెలల్లో మూడు రాజధానుల ఫార్ములా ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైఎస్సార్‌సీ ప్రభుత్వం అంకితభావంతో ఉందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. అమరావతిని శాసనసభ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రస్తుతం మంత్రులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అమరావతిని రాజధానిని తరలించడం లేదని.. ఇక్కడ శాసన రాజధాని ఉంటుందని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని వివరిస్తున్నారు. 

అలాగే.. వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రులు, వైసీపీ నేతలతో కీలక పాత్ర అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వేదిక ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు.. మూడు రాజధానులతోనే రాష్ట్రం  అభివృద్ది చెందుతుందనే సందేశాన్ని పంపుతున్నారు. 

ఇలా న్యాయపరంగా అడ్డంకులు తొలగించడం, ప్రజల మద్దతు కూడగట్టడం, ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వడం.. ద్వారా మూడు రాజధానులపై సీఎం జగన్ కౌంటర్ ప్లాన్‌‌ను సిద్దం చేశారు. 

click me!