రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తనకు సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది.
గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రమేష్ కుమార్ ను తొలగించడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు సంక్రమించిన అధికారాల ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది.
undefined
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రమేష్ కుమార్ కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా వేశారని జగన్ స్వయంగా రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తనకు రక్షణ కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా వైఎస్ జగన్ కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా ఆయన తన కార్యాలయాన్ని హైదరాబాదులో కేటాయించిన భవనానికి మార్చుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసపై రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారనే విషయంపై కూడా రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల పేరు మీద వైసీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర పార్టీల నాయకులు రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.