నిమ్మగడ్డ కొనసాగింపుపై అనిశ్చితి: జగన్ సర్కార్ ఆలోచన ఇదీ...

By telugu teamFirst Published Jul 23, 2020, 8:45 AM IST
Highlights

ఎస్ఈ,సీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీబాధ్యతలు చేపట్టే విషయంపై అనిశ్చితి చోటు చేసుకునే అవకాశాలే ఉన్నాయి. నిమ్మగడ్డకు ఇప్పట్లో జగన్ సర్కార్ పదవీ బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని అంటున్నారు.

అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా కొనసాగించే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రమేష్ కుమార్ బాధ్యతల స్వీకారంపై మరికొంత కాలం అనిశ్చితి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆదేశిస్తూ  గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ వెళ్లింది. మే 29వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు  ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినట్లుగా గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎకె మీనా నిమ్మగడ్డకు కూడా లేఖను పంపించారు. 

Also Read: పంతానికి పోతే: నిమ్మగడ్డ ఇష్యూలో జగన్ కు వరుస ఎదురు దెబ్బలు ఇవీ...

హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ను కలిసేందుకు ఈ నెల 17వ తేదీన్నే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధపడ్డారు. అయితే, గవర్నర్ ఈ నెల 20వ తేదీన సమయం ఇచ్చారు. ఈలోగా జగన్ సర్కార్ చకచకా పావులు కదిపింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని సుప్రీంకోర్టును కోరింది. 

దానిపై సుప్రీంకోర్టు శుక్రవారం ఈ నెల 24వ తేదీన విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

Also Read: నిమ్మగడ్డ ఇష్యూ: చంద్రబాబు హ్యాపీ, ఆత్మరక్షణలో వైఎస్ జగన్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను, కొత్త ఎస్ఈసీగా కనగరాజ్ నియమిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టి వేస్తూ మే 29వ తేదీన తీర్పు చెప్పింది. దాంతో తాను తిరిగి పదవీబాధ్యతలను చేపట్టినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే, ఆ నియామకాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి రద్దు చేశారు. 

హైకోర్టు తీర్పు స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీంకోర్టు మూడుసార్లు అందుకు నిరాకరించింది. ఈ స్థితిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు... గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డకు సూచించింది. ఈ మేరకు నిమ్మగడ్డ 20వ తేదీన గవర్నర్ హరిచందన్ ను కలిశారు. ఆ భేటీ తర్వాత హరిచందన్ నిమ్మగడ్డను కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు.. 

కాగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మరో 8 నెలలు ఉంది. ఈలోగా వ్యవహారాలు ఏ విధమైన మలుపులు తీసుకుంటాయనేది ఆసక్తికరంగానే ఉంది.

click me!