ఏపీలో నిరుద్యోగులకు మరో వరం: 8వేల పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్

By Nagaraju penumalaFirst Published Oct 19, 2019, 8:56 PM IST
Highlights

నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొలువుల జాతర ప్రారంభించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలతో మెుత్తం భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారు సీఎం జగన్.  

నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 8వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిసర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది. మెుత్తం పోస్టుల్లో 2,400 ఎస్జీటీ పోస్టులు కాగా 3,600 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలోనే భర్తీ చేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. 

ఉద్యోగాలకు ఎంపికైన స్కూల్ ఎస్జీటీ టీచర్లకు రూ.5000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.700 జీతంగా చెల్లించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యావాలంటీర్లను నియమించాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.  

విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అత్యధికంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 800 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖ బలోపేతానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

అలాగే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా అమ్మఒడి వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లికి ఏడాదికి రూ.15వేలు చెల్లించనుంది. 

click me!