
విశాఖ నుంచి త్వరలో పరిపాలనా చేస్తానంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తగినట్లుగానే విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం, మంత్రులు, అధికారులు, శాఖాధిపతుల కార్యాలయాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడం లేదని పేర్కొంది. ఆఫీసులు తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపించాలని రిజిస్ట్రీలో ప్రభుత్వ న్యాయవాది అప్లికేషన్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ALso Read: విశాఖ పరిపాలనా రాజధాని : మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు .. సీఎస్ ఆదేశాలు
కాగా.. సీఎం ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గత నెలలో విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. నగరంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది . విశాఖ రిషికొండపై వున్న మిలీనియం టవర్స్‌లో మంత్రులు , అధికారుల క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ గుర్తించింది.
మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను ఇందుకోసం కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని.. అలాంటి వెసులుబాటు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌లను కేటాయిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది.